Share News

Fifth Phase of Resurvey ఐదో విడత రీ సర్వేకు సమాయత్తం

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:54 PM

Preparations Underway for the Fifth Phase of Resurvey జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి ఐదో విడత భూ రీసర్వే ప్రారంభం కానుంది. 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో అధి కారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 13 మండలాల్లోని 139 గ్రామాల్లో 85 సర్వే టీము లను ఏర్పాటు చేశారు. 1.54 లక్ష ఎకరాలకు సంబంధించి రీసర్వే చేయాల్సి ఉంది.

 Fifth Phase of Resurvey ఐదో విడత రీ సర్వేకు సమాయత్తం
జియ్యమ్మవలసలో రీ సర్వే చేయాల్సిన భూములు..

  • సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం

జియ్యమ్మవలస, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి ఐదో విడత భూ రీసర్వే ప్రారంభం కానుంది. 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో అధి కారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 13 మండలాల్లోని 139 గ్రామాల్లో 85 సర్వే టీము లను ఏర్పాటు చేశారు. 1.54 లక్ష ఎకరాలకు సంబంధించి రీసర్వే చేయాల్సి ఉంది. ఇందులో జిరాయితీ భూముల విస్తీర్ణం 1.07 లక్ష ఎకరాలు కాగా ప్రభుత్వ పోరంబోకు భూముల విస్తీర్ణం 47 వేల ఎకరాలు. ఇదిలాఉండగా జిల్లాలో ఎనిమిది మండలాల్లో సిగ్నల్స్‌ లేని 324 గ్రామాల్లో మొత్తం 1.71 లక్ష ఎకరాలకు సంబంధించి గతనెల 21 నుంచి రీసర్వే జరుగుతోంది. కలెక్టర్‌ , జేసీ ఆదేశాల మేరకు ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో రీ సర్వే చేపడుతన్నారు. ‘ జిల్లాలో సిగ్నల్స్‌ లేని గ్రామాల్లో పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. ఈ నెల 15 నుంచి ఐదో విడత రీ సర్వే ప్రారంభిస్తాం. భూసమస్యలు లేకుండా ప్రక్రియ నిర్వహిస్తాం.’ అని జిల్లా సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్‌ తెలిపారు.

ఇదీ పరిస్థితి...

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 965 గ్రామాలున్నాయి. మొదటి విడతగా 317 గ్రామాల్లో 1.81 లక్ష ఎకరాల్లో రీసర్వే పూర్తి చేశారు. ఆ తరువాత పైలట్‌ ప్రాజెక్టు కింద 15 గ్రామాల్లో (మండలానికి ఒక గ్రామం చొప్పున) 8,914 ఎకరాల్లో 36 టీములు రీసర్వే చేశాయి. రెండో విడతగా 30 గ్రామాల్లో 108 టీములతో 27వేల ఎకరాలు, మూడో విడతగా 43 గ్రామాల్లో 73 టీములతో 27వేల ఎకరాల్లో భూ రీ సర్వే చేశారు. నాలుగో విడతగా 14 మండలాల్లోని 83 గ్రామాల్లో 66 టీములతో 79 వేల ఎకరాల్లో రీ సర్వే పూర్తి చేశారు. ఇంతవరకు జరిగిన నాలుగు విడతల భూసర్వేతో పాటు పైలట్‌ ప్రాజెక్టు కింద జరిగే రీసర్వేకు సంబంధించి గ్రౌండ్‌ ట్రూతింగ్‌, వెక్టిరైజేషన్‌ పనులు పూర్తయ్యాయి. కాగా నాలుగో విడత చేసిన భూ రీసర్వే రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

తప్పులన్నీ సరి చేస్తూ..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ రీసర్వేలో జరిగిన తప్పులన్నింటినీ సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో హక్కుదారునికి చెందాల్సిన భూమిని వేరే వారి భూవిస్తీర్ణంలో నమోదు చేయగా, జాయింట్‌ ఎల్‌పీఎంల సమస్యలపై రెవెన్యూ, సర్వే శాఖలు దృష్టి సారించాయి.

Updated Date - Apr 12 , 2026 | 11:54 PM