Srivari Kalyanotsavam శ్రీవారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:12 AM
Preparations Underway for Srivari Kalyanotsavam ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి దేవస్థానం స్వామివారి కల్యాణ మహోత్సవాలకు ముస్తాబవుతోంది. వేంకటేశ్వర, కోదండ రామస్వామి దేవస్థానాల పరిధిలో ఈ నెల 27నుంచి ఫిబ్రవరి1 వరకు నిర్వహించనున్న వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
27 నుంచి ఫిబ్రవరి 1 వరకు వేడుకలు
గరుగుబిల్లి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి దేవస్థానం స్వామివారి కల్యాణ మహోత్సవాలకు ముస్తాబవుతోంది. వేంకటేశ్వర, కోదండ రామస్వామి దేవస్థానాల పరిధిలో ఈ నెల 27నుంచి ఫిబ్రవరి1 వరకు నిర్వహించనున్న వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్, చైర్మన్ ఎం.పకీరు నాయుడు మాట్లాడుతూ.. 27న ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమ వుతాయన్నారు. 28న సుప్రభాత సేవ, నిత్యారాధన, ధ్వజారోహణం, కల్యాణ మండప పూజ నిర్వహించనున్నట్లు చెప్పారు. 29న గరుడ వాహనంపై స్వామివారి తిరువీధి మహోత్సవం, భక్తులకు అన్నసమారాధన, క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 30న తిరువీధి మహోత్సవం, 31 ప్రత్యేక పూజలు, ఫిబ్రవరి 1న పవిత్ర నాగావళి నదీ తీరంలో స్వామివారికి శ్రీచూర్ణోత్సవం, శ్రీచక్ర తీర్థస్నానం చేపడతామని తెలిపారు. అర్చకుల ఆధ్వర్యంలో పాణిగ్రహణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనే దంపతులు, భక్తులు ముందుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.