పంచాయతీ పోరుకు కసరత్తు
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:49 PM
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.
- కులాల వారీగా ఓటర్లను గుర్తించాలని ఉన్నతాధికారుల ఆదేశం
-పంచాయతీ కార్యదర్శులకు బాధ్యత
- ఈ నెల 22 వరకు ఇంటింటా సర్వే
- సెప్టెంబరు 3 నుంచి గ్రామసభలు
- 7న రెండో విడత ఓటరు జాబితా ప్రచురణ
గరుగుబిల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో 15 మండలాల్లోని 451 పంచాయతీల్లో ఇప్పటికే తొలివిడత ఓటర్ల జాబితాను ప్రచురించారు. వీటి పరిధిలో పురుషులు 3,14,887 మంది, మహిళలు 3,33,273 మంది కలిపి మొత్తం 6,48,226 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం రెండో విడత ఓటరు జాబితా కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీల పరిధిలో ఎంతమంది షెడ్యూల్ కులాలు, అలాగే షెడ్యూల్ తెగలు, బీసీల ఓటర్లు ఉన్నారన్న దానిపై ప్రత్యేక నివేదికలు అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు సంబంధిత జిల్లా, గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఇంటింటా సర్వే..
జిల్లాలో రెండో విడత ఇంటింటా సర్వే మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 22 వరకు జరగనుంది. 23, 24 తేదీల్లో సంబంధిత వర్గాల ఓటర్ల గుర్తింపు, 25న జాబితాలు తయారీ, 26 నుంచి 28 వరకు అభ్యంతరాల పరిశీలన, 29 నుంచి సెప్టెంబరు 2 వరకు (ఫైనలైజేషన్ ప్రక్రియ) ఉంటుంది. విచారణ, అభ్యంతరాలు తదుపరి కులాల వారీగా ఓటర్ల జాబితాలను వివరించేందుకు సెప్టెంబరు 3 నుంచి 6 వరకు గ్రామసభలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 7న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. కులాల వారీగా సమగ్ర సమాచార సేకరణ బాధ్యతను సంబంధిత గ్రామ పంచాయతీల అభివృద్ధి అధికారులకు అప్పగించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. కేంద్రాల పరిధిలో ప్రధాన సౌకర్యాలతో పాటు బ్యాలెట్ బాక్సులు ఎంతమేర అవసరం, తదితర సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలను అందించారు. విద్యుత్ సౌకర్యం, భవనాల పరిస్థితి, ప్రహరీల ఏర్పాటుతో పాటు ఎన్నికలకు అవసరమయ్యే సమగ్ర సమాచార నివేదికను సమర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న ప్రచురించిన ఓటర్ల జాబితాలకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు.
లోపాలు లేకుండా సర్వే
పంచాయతీల పరిధిలో లోపాలు నెలకొనకుండా సర్వే నిర్వహించాలి. తప్పిదాలకు ఆస్కారం లేకుండా కులాలవారీగా ఓటర్ల వివరాలను సేకరించాలి. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సి ఉంది. రోజువారీ నివేదికలపై నిర్లక్ష్యం వహించరాదు. పంచాయతీల సిబ్బంది సమాచార సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
ఎస్.రవీంద్ర, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, పార్వతీపురం మన్యం