Share News

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలకు సన్నద్ధం

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:52 PM

జిల్లాలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

 పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలకు సన్నద్ధం

- త్వరలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అధికారులు

- ప్రభుత్వ షెడ్యూల్‌ వచ్చిన వెంటనే ప్రక్రియ

పార్వతీపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీల గడువు పూర్తికావ డంతో కొత్త కమిటీల ఎన్నికలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి షెడ్యూల్‌ రావాల్సి ఉంది. పాఠశాలల అభివృద్ధిలో ఈ కమిటీలు ఎంతో కీలకం. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్నం భోజనం పథకం అమలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు తదితర వాటిపై కమిటీల పర్యవేక్షణ ఉంటుంది. స్థానిక ఎన్నికలకు ముందే ఈ కమిటీల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో మినీ స్థానిక ఎన్నికల సమరంగా రాజకీయ పార్టీలు భావించే పరిస్థితి ఉంది. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య ఈ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విద్యా వ్యవస్థలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ, పరోక్షంగా వాటి ప్రమేయం పాఠశాలలపై కొనసాగుతుంది. పాఠశాలల కమిటీల్లో రాజకీయ పార్టీల మద్దతుదారులు ఉండడమే దీనికి కారణం. జిల్లాలో మొత్తం 1703 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 57,664 మంది విద్యార్థులు, 56,675 మంది విద్యార్థినులు కలిసి మొత్తం 1,14,339 మంది చదువుతున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన కమిటీల ఎన్నికలు జరుగనున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి తరగతి నుంచి ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. కోరం తప్పనిరిగా ఉండాలి. ఎన్నికల అధికారిగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మా త్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. సభ్యుల్లో ఇద్దరిని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును వివరణ కోరగా.. ‘ప్రభుత్వం నుంచి ఇంకా షెడ్యూల్‌ రాలేదు, షెడ్యూల్‌ వస్తే దానికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తాం’అని తెలిపారు.

Updated Date - Jul 11 , 2026 | 11:52 PM