Preparations for Battle సమర సన్నాహాలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:05 AM
Preparations for Battle రాజాం మున్సిపాలిటీలో రెండోదశలో ఎన్నికలు నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు రాజాం మున్సిపాలిటీలో శనివారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించారు.
సమర సన్నాహాలు
రాజాం మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గుర్తింపు
షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపల్ పరిపాలనా విభాగం
నేటి నుంచి ఇంటింటా సర్వే
29న తుది జాబితా ప్రచురణ
రాజాం రూరల్, అక్టోబరు 24 (ఆంరఽధజ్యోతి):
రాజాం మున్సిపాలిటీలో రెండోదశలో ఎన్నికలు నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు రాజాం మున్సిపాలిటీలో శనివారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. న్యాయస్థానంలో నెలకొన్న వివాదం కారణంగా రెండు దశాబ్దాలుగా ఎన్నికలకు నోచుకోని రాజాం మున్సిపాలిటీకి సంబంధించి గతనెలలో విలీన పంచాయతీల వివాదాలను కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో ఓటర్ల గుర్తింపునకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈనెల 23న ఐదు రోజుల షెడ్యూల్ ప్రకటించారు. అయిదురోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి వార్డులవారీగా తుది జాబితాను సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ జాబితాలో జిల్లాలో రాజాం మున్సిపాలిటీ మాత్రమే ఉండడంతో రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, సిబ్బంది ఏర్పాట్లు ప్రారంభించారు.
ఇదీ షెడ్యూల్...
- ఈనెల 25, 26న ఇంటింటా సర్వే నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్లను గుర్తిస్తారు.
- 27న గుర్తించిన ఓటర్లతో ముసాయిదా జాబితాలను ప్రకటిస్తారు. మున్సిపల్, తహసీల్దార్, ఆర్డీవో తదితర ప్రభుత్వ కార్యాలయాలలో ప్రచురిస్తారు.
- 28న ఓటర్ల గుర్తింపుపై క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. క్లెయిమ్‌లను ఫారం 2 ద్వారా, అభ్యంతరాలను ఫారం 3 ద్వారా స్వీకరిస్తారు. వచ్చిన క్లెయిమ్‌ల జాబితాను నోటీసుబోర్డుపై ప్రదర్శిస్తారు. అభ్యంతరాలకు సంబంధించి నోటీసులు జారీ చేస్తారు.
- 29న క్లెయిమ్స్, అభ్యంతరాలపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి పరిష్కరిస్తారు. ఆ తరువాత ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు చేసి, ఫారం 6లో వార్డులవారీగా తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాను ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేస్తారు.