Pregnant Student గర్భం దాల్చిన ఏకలవ్య విద్యార్థిని
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:15 PM
Pregnant Ekalavya Student కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు దీనిపై ఐటీడీఏ డీడీ విచారణ చేపట్టారు.
విచారణ చేపట్టిన ఐటీడీఏ డీడీ
కురుపాం/పార్వతీపురం, జనవరి22(ఆంధ్రజ్యోతి): కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు దీనిపై ఐటీడీఏ డీడీ విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..
గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన విద్యార్థిని ఏకలవ్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెలవుల అనంతరం ఆమె కళాశాలకు హాజరు కాలేదు. ఈ మేరకు కళాశాల సిబ్బంది విద్యార్థిని తల్లిదండ్రులను వాకబు చేయగా అసలు విషయం బయట పడింది. విద్యార్థినికి అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్తే ఎనిమిది నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించినట్లు తల్లిదండ్రులు తెలియజేశారని కళాశాల సిబ్బంది చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల ప్రతినిధులు పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం డిప్యూటీ డైరెక్టర్ విజయశాంతి ఏకలవ్య కళాశాలలో విచారణ చేపట్టారు. అక్కడున్న సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. గర్భం దాల్చిన బాలిక ప్రతినెలా శానిటరీ నాప్‌కిన్లు తీసుకోవడం వల్ల కళాశాలలో ఎవరికీ అనుమానం రాలేదని డీడీ చెప్పారు. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థినికి ఒంటిలో బాగాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గర్భం దాల్చిన విషయం బయట పడిందని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థిని ఇంటర్ ప్రాక్టికల్స్‌కి హాజరైందన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రియుడు ఇంటికి ఆ విద్యార్థినిని తల్లిదండ్రులు పంపించినట్లు తెలిసింది.