Share News

Practicing yoga with enthusiasm ఉత్సాహంగా యోగా

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:32 AM

Practicing yoga with enthusiasm జిల్లా కేంద్రంలో యోగా దినోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు, క్రీడాకారులు, ఉద్యోగులు, ఇతరులు హాజరై యోగాసనాలు వేశారు. ఆదివారం సెలవు కావడంతో అత్యధికంగా పాల్గొన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Practicing yoga with enthusiasm ఉత్సాహంగా యోగా
యోగాసనాలు వేస్తున్న ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌

ఉత్సాహంగా యోగా

జిల్లా కేంద్రానికి తరలివచ్చిన విద్యార్థులు, క్రీడాకారులు, ఉద్యోగులు

హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ

విజయనగరం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో యోగా దినోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు, క్రీడాకారులు, ఉద్యోగులు, ఇతరులు హాజరై యోగాసనాలు వేశారు. ఆదివారం సెలవు కావడంతో అత్యధికంగా పాల్గొన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగాసనాల అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాల్లో యోగా ఒక భాగమన్నారు. దీనిని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గుర్తుచేశారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, కలిసికట్టుగా యోగా సాధన చేయడం ద్వారా ఇతరులకు స్ఫూర్తి కలుగుతుందన్నారు. పాఠశాలల్లో యోగాను బోధనాంశంగా చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలిలో కుటుంబ పోషణ, పనుల ఒత్తిడిలో పడి చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నిరంతరం యోగా చేయడం వల్ల శారీరక ధృడత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం పది నిమిషాల సమయం కేటాయించాలన్నారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అవసరమని, అందుకు యోగా దోహదపడుతుందన్నారు. అనంతరం యోగా గురువులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో యోగాంధ్ర జిల్లా సమన్వయ కర్త, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలాస్వామి, యోగాంధ్ర నోడల్‌ అధికారి డాక్టరు వరప్రసాద్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు, కూటమి నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

యోగా గురువుకు అస్వస్థత

విజయనగరం టౌన్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ట్యాంకుబండ్‌ రోడ్డు సమీపంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న యోగా గురువు సుందర శివరావు (63) అస్వస్థతకు గురయ్యాడు. కలెక్టర్‌, ఎస్పీ ఆదేశాలతో హుటాహుటిన స్థానిక వైద్య బృందం అతనికి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108లో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం శివరావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్య బృందం తెలిపింది.

యోగాతో మానసిక ప్రశాంతత : జిల్లా న్యాయాధికారి బబిత

విజయనగరం దాసన్నపేట, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా అవసరమని జిల్లా న్యాయాధికారి, న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ ఎం.బబిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. దైనందిన జీవితంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యాయామం, యోగా, మెడిటేషన్‌లు చేయడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో న్యాయాధికారులు విజయకళ్యాణి, బి.అప్పలస్వామి, ఎం.శ్రీధర్‌, జి.దుర్గయ్య, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:32 AM