Prabhanjanam ప్రభం‘జనం’
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:33 AM
Prabhanjanam భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేసిన దృశ్యాల్ని చూసేందుకు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు విశేషంగా తరలివచ్చారు. ఎటు చూసినా జనమే కనిపించారు. సభా స్థలి అంతా కిటకిటలాడింది.
ప్రభం‘జనం’
ప్రధాని మంత్రి సభకు భారీగా ప్రజల హాజరు
సభా స్థలంలో ఖాళీ లేక రోడ్డు, బస్సులపై నుంచి ప్రసంగాన్ని విన్న వేలాది మంది
భోగాపురం, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి):
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేసిన దృశ్యాల్ని చూసేందుకు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు విశేషంగా తరలివచ్చారు. ఎటు చూసినా జనమే కనిపించారు. సభా స్థలి అంతా కిటకిటలాడింది. వేదిక లోపల స్థలం లేక వేలాది మంది బయటే ఉండిపోయారు. వారంతా బస్సుల్లో నుంచి, బస్సుల పైనుంచి అధినేతల ప్రసంగాలను విన్నారు. ఉదయం 9.30 గంటలకే సభా వేదిక నిండిపోయింది. దీంతో ఆ తర్వాత వచ్చిన వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాలనుంచి వచ్చిన వారు ఎలాగైనా మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను చూడాలని నిర్ణయించుకొని ప్రహరీ దాటేందుకు ప్రయత్నించడం కనిపించింది. కూటమి పార్టీల శ్రేణులు జెండాలు, అభిమాన నాయకుల ఫొటోలు చూపుతూ ఎక్కడికక్కడ సందడి చేశారు.
- ఎయిర్‌పోర్టు సభా ప్రాంగానికి ప్రధాని నరేంద్రమోదీ 11.35 గంటలకు చేరుకొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తొలుత ప్రసంగించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆయన హిందీలో ఉపన్యాసించగా దానిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో వివరించారు.
తిరుగు ప్రయాణం.. భారం
తిరుగు ప్రయాణంలో అన్ని బస్సులు, ప్రజలు ఒకే సమయంలో బయలుదేరడంతో ఎయిర్‌పోర్టు నుంచి గూడెపువలస రహదారిలో హైవే చేరేందుకు (సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి దాటేందుకు) నాలుగైదు గంటలు పట్టింది. బస్సులన్నీ నత్తనడకన కదిలాయి.