power problems ఎప్పటికప్పుడే..
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:23 AM
power problems జిల్లాలో విద్యుత్ కోతలు తగ్గడం లేదు. అనధికారిక కోతలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) పేరుతో అర్ధరాత్రి సైతం సరఫరాను నిలిపివేస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఎటువంటి కోతలు లేవని చెబుతున్నారు.
ఎప్పటికప్పుడే..
ఈఎల్‌ఆర్ పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేత
పల్లెల నుంచి నగరాల వరకూ అదే పరిస్థితి
రాత్రిపూటే అధికం
ఒక్కసారిగా పెరిగిన వినియోగమే కారణం
వ్యవసాయ పంపుసెట్లకు అధికంగా వినియోగం
పరిశ్రమలపైనా ప్రభావం
విజయనగరం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్ కోతలు తగ్గడం లేదు. అనధికారిక కోతలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) పేరుతో అర్ధరాత్రి సైతం సరఫరాను నిలిపివేస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఎటువంటి కోతలు లేవని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కాస్త వానలు పడినా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుండే చోట వర్షాభావం నెలకొంది. దీంతో నీటి లభ్యత లేదు. ఈ కారణంగా జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో పవన, సోలార్ విద్యుత్ అవసరానికి సరిపడా ఉత్పత్తి లేదు. దీంతో అనధికారిక విద్యుత్ కోతలు తప్పడం లేదు. కొద్దిరోజులుగా రాత్రిపూట సరఫరా నిలిపివేస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
సాంకేతిక సమస్యలు..
జిల్లాలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. లోడ్ పెరిగి ట్రిప్ కావడం, జంపర్లు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. సాధారణంగా జిల్లాలో సగటున రోజులో 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అదే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మాత్రం 11 నుంచి 12 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టి మళ్లీ 10 మిలియన్ యూనిట్ల వినియోగానికి చేరుకుంటుంది. కానీ ఈ సారి సెప్టెంబరులో సైతం రికార్డుస్థాయిలో 12 మిలియన్ యూనిట్ల వినియోగం కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వినియోగానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి కాకపోవడమే అసలు సమస్య. అందుకే ఈఎల్‌ఆర్ పేరుతో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు స్పష్టమవుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా సరఫరా నిలిచిపోతుండడంతో ప్రజల బాధలు వర్ణనాతీతం.
అన్నిరంగాలపైనా ప్రభావం..
జిల్లాలో అన్నిరకాల విద్యుత్ వినియోగదారులకు కలిపి దాదాపు 7,26,733 కనెక్షన్లు ఉన్నాయి. 98 విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 467 మెగావాట్లు. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. జల విద్యుత్ పుష్కలంగా లభించేది. ఆపై భూగర్భ జలాలు బాగా ఉండడంతో వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉండేది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రోజుకు సగటున విద్యుత్ వినియోగం 12 మిలియన్ యూనిట్లు దాటుతోంది. ఈ నెల ప్రారంభం నుంచి ఇదే స్థాయిలో నమోదవుతుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. అదే గత ఏడాది సెప్టెంబరు మొదటి వారంలో అయితే కేవలం 10 మిలియన్ యూనిట్ల వరకూ వినియోగించేవారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. 40 నుంచి 60 అడుగుల లోతుకు వెళితే కానీ నీరు అందడం లేదు. ఈ తరుణంలో వ్యవసాయ పంపుసెట్ల వినియోగానికి విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నారు.
ఘోరంగా కోతలు..
వెంకటరావు, డెంకాడ
విద్యుత్ కోతలు ఘోరంగా ఉంటున్నాయి. అర్ధరాత్రి సమయాల్లో సైతం సరఫరాను నిలిపివేస్తున్నారు. గంటల తరబడి నిలిచిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులను అడుగుతుంటే కోతలు లేవంటున్నారు. కానీ ఈఎల్‌ఆర్ పేరుతో సరఫరాను నిలిపివేస్తున్నారు. కోతలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.
రాత్రిపూట అసౌకర్యం
సుబ్రహ్మణ్యం, పూసపాటిరేగ
రాత్రి పూట నిద్ర సమయంలోనే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. వర్షాలు లేక వేడి వాతావరణం ఉంటోంది. కరెంటు సరఫరాను నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా కోతలు లేకుండా అధికారులు చూడాలి.
వినియోగం పెరిగింది
జిల్లాలో ఈఎల్‌ఆర్‌లు లేవు. అధికారిక కోతలు లేవు. సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. అవసరానికి తగ్గ ఉత్పత్తి జరగడం లేదు. అయినా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. సూపర్ ఎలినినో ప్రభావం వల్ల విండ్ పవర్, థర్మల్ పవర్, కృష్ణపట్టణం, హిందూజా తదితర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 1500 మెగావాట్ల లోటు విద్యుత్ ఉంది. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రోజుకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నాం. సాఽధ్యమైనంత వరకూ సరఫరాలో అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
- ఎం.లక్మణరావు, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ, విజయనగరం