Share News

Travel Turns Miserable అడుగుకో గుంత.. ప్రయాణ అవస్థ!

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:25 PM

Potholes at Every Step, Travel Turns Miserable నియోజకవర్గంలో మక్కువ ప్రాంతం నుంచి సాలూరు, బొబ్బిలి పట్టణాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. భారీ గోతులతో ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని దుస్థితి.

  Travel Turns Miserable అడుగుకో గుంత..  ప్రయాణ అవస్థ!
మక్కువ-సాలూరు రోడ్డు ఇలా..

  • దారంతా గోతులు.. రాకపోకలకు అవస్థలు

  • ఏళ్లు గడుస్తున్నా మారని పరిస్థితి

  • ప్రయాణికులు, వాహనదారులకు తప్పని ఇబ్బందులు

  • పట్టించుకోని ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు

మక్కువ, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో మక్కువ ప్రాంతం నుంచి సాలూరు, బొబ్బిలి పట్టణాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. భారీ గోతులతో ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని దుస్థితి. అడు గుకో గుంత ఏర్పడగా.. వాటిల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో రాకపోకలు సాగించడం కష్టతరంగా మారింది. దీంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నేళ్లుగా ఆయా రోడ్లు ఇదే పరిస్థితిలో ఉన్నా.. నిర్మాణాలు మాత్రం సాగడం లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

మక్కువ సువర్ణముఖి వంతెన నుంచి సాలూరు మండలం బాగువలస వరకు ఉన్న తారురోడ్డు పూర్తిగా పాడైంది. దీంతో ఏడాదికాలంగా ఈ మార్గంలో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఎన్‌డీబీ కింద నిధులు మంజూరైనా సకాలంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రూ.5కోట్ల వరకు బిల్లులను చెల్లించింది. అయితే నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో పాత రేట్ట ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టలేమని సదరు ఉప కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు. దీంతో మక్కువ నుంచి సాలూరు వెళ్లే రోడ్డుకు మోక్షం లభించడం లేదు. గత ఆరేళ్లుగా ప్రయాణికులు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మక్కువ నుంచి బొబ్బిలి పట్టణానికి వెళ్లే రోడ్డు కూడా పాడైనా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు నానా అవస్థలు పడుతున్నారు. 16 కిలోమీటర్ల రోడ్డును డబుల్‌లైన్‌ చేయాలని ప్రజలు ఏళ్లతరబడి కోరుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యల్లేవు. ఇక మక్కువ సువర్ణముఖినది వంతెనపైన ఏర్పడిన గోతులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. వంతెన మరమ్మతులకు రూ.15లక్షలు, సాలూరు రోడ్డు నుంచి బాగువలస వరకు, నారసింహునిపేట వరకు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఆర్‌అండ్‌బీ అధికారులు ఏడాది కాలంగా చెబుతన్నారు తప్పితే పనులు మాత్రం చేపట్టడంలేదు. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ జ్ఞానేశ్వరరావును వివరణ కోరగా.. ‘వర్షాలు తగ్గిన వెంటనే ఆయా పనులు చేపడతాం. మక్కువ-బొబ్బిలి రోడ్డు పనులకు టెండరు ఖరారు కావల్సి ఉంది. సాలూరు-మక్కువ రహదారి నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Aug 01 , 2026 | 11:25 PM