Share News

Postponement is the agenda వాయిదాయే అజెండా

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:51 PM

Postponement is the agenda

Postponement is the agenda వాయిదాయే అజెండా
శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ కార్యాలయం

వాయిదాయే అజెండా

పంచాయతీ సమావేశాలకు తరచూ సభ్యుల గైర్హాజరు

తగినంత హాజరు లేక వాయిదా పడుతున్న సమావేశం

వరుసగా మూడుసార్లు ఇదే తీరు

పుణ్యగిరి మహా శివరాత్రి జాతరపై జరగని చర్చ

ఎస్‌.కోట అభివృద్ధిపైనా తీవ్ర ప్రభావం

రాజకీయపరమైన వైరుధ్యమే కారణమా?

ఈ ఏడాది కూడా అదే తంతు. తమకు చెప్పకుండా సర్పంచ్‌ సూచనతో పంచాయతీ అధికారులు అజెండాలో పలు అంశాలు నమోదు చేశారని శుక్రవారం ఏర్పాటు చేసిన సాధారణ సమావేశానికి సభ్యులు గైర్హాజరయ్యారు. తగినంత హాజరు లేకపోవడంతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. 2024 డిసెంబరు 28న సాధారణ సమావేశానికి ఆరుగురు హాజరుకావడంతో వాయిదా వేశారు. తిరిగి 2025 జనవరి8న ఏర్పాటు చేసిన సమావేశానికి ఐదుగురు సభ్యులే రావడంతో మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా వరుసగా మూడుసార్లు ఎస్‌.కోట పంచాయతీ సమావేశం వాయిదా పంథాలో నడుస్తోంది. పాలకవర్గ సభ్యులు మూడు వర్గాలుగా విడిపోయి వారి మధ్య సఖ్యతలేకే ఈ పరిస్థితి తలెత్తుతోందని స్థానికుల మాట.

శృంగవరపుకోట, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి):

పుణ్యగిరి మహా శివరాత్రి జాతర సమీపిస్తుండడంతో అధికారులకు టెన్సన్‌ పట్టుకుంది. ఈనెల 15న మహా శివరాత్రి. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. దేవదాయ శాఖ ఈనెల 13 నుంచి శివరాత్రి ఉత్సవాలు జరపాలని కూడా నిర్ణయించింది. ఎస్‌.కోట దేవిబొమ్మ కూడలి నుంచి పుణ్యగిరి కొండ వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా జంగిల్‌ క్లియిరెన్స్‌ చేయాలి. రోడ్డులో పడిన గుంతలను కప్పాలి. ఇందుకు అయ్యో ఖర్చును పంచాయతీ భరించేందుకు సభ్యుల ఆమోదం అవసరం. సర్పంచ్‌ గనివాడ సంతోషికుమారి అధ్యక్షతన తాజాగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాధారణ సమావేశానికి 20 మంది వార్డు సభ్యులకు గాను ఐదుగురే హాజరయ్యారు. కనీసం ఏడుగురు సభ్యులు హాజరైతేనే తీర్మానాలపై చర్చించేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో అధికారులు అయోమయంలో పడ్డారు.

అదే కారణం

గత ఏడాది మహాశివరాత్రి పర్వదినానికి నెలరోజుల ముందే సదుపాయాల కల్పనకు అవసరమైన ఖర్చులపై చర్చించేందుకు అజెండాలో నమోదు చేశారు. అప్పుడు కూడా తమకు చెప్పకుండా అజెండాలో అంశాలను చేర్చారని సభ్యులంతా మూకుమ్మడిగా రావడం మానేశారు. రెండుసార్లు సమావేశం వాయిదా పడింది.

మూడు గ్రూపులుగా సభ్యులు

పంచాయతీ సమావేశం విషయంలో అధికార టీడీపీకి చెందిన సభ్యులు, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల ఒకటిగా కలుస్తున్నాయి. పంచాయతీలో 20 వార్డులకు 13 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. 6వార్డులను టీడీపీ గెలుచుకుంది. ఒకరు స్వతంత్య్ర అభ్యర్థిగా ఉన్నారు. దీంతో ఈ పంచాయతీ వైసీపీ పాలనలో ఉండేది. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న ప్రస్తుత రాష్ట్ర టూరిజం డవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ఇందుకూరి సుధారాణి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈమెతో పాటు సర్పంచ్‌ గనివాడ సంతోషి కుమారి టీడీపీలోకి వచ్చేయడంతో వైసీపీ అనుకూల సభ్యులకు దూరమయ్యారు. అయితే వీరికి టీడీపీ సభ్యులతోనూ సఖ్యత కుదరలేదని అందరూ చెప్పుకుంటారు. దీంతో అప్పటి నుంచి సభ్యులు మూడు గ్రూపులుగా విడిపోయారు.

ఫోన్‌లో ఒకరికొకరు సమాచారం

సర్పంచ్‌కు అనుకూలంగా ముగ్గురు సభ్యులు ఉంటున్నారు. స్వతంత్య్ర సభ్యుడు శేషగిరిరావు మధ్యస్థంగా ఉంటున్నారు. మిగిలిన వైసీపీ, టీడీపీ సభ్యులు అవసరమైనప్పుడల్లా ఒకటవుతున్నారు. ‘మేం రావడం లేదు.. మీరూ రాకండ’ంటూ ఫోన్‌ల ద్వారా ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుంటున్నారు. అజెండాలో అంశాలు తమకు చెప్పకుండా నమోదు చేసినందున చర్చించేందుకు రావడం మానేస్తుండడంతో వివాదాలకు తావిస్తోంది.

ఆది నుంచీ..

పాలకమండలి అధికారం చేపట్టిన నాటి నుంచి ఒకరిద్దరు తప్ప మిగిలిన సభ్యులంతా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల కనుసన్నల్లో పని చేస్తున్నారు. మూడు వర్గాలుగా విడిపోయారు. అభివృద్ధి పనులన్నింటినీ రాజకీయ కోణంతోనే చూస్తున్నారు. ఒక వర్గం అవునంటే రెండు వర్గాలు కాదంటున్నాయి. ఈ పరిణామం పంచాయతీ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఒక్కోనేత ఒక్కో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎవరికి వారే పైచేయి అనిపించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు.

పడకేసిన అభివృద్ధి

పంచాయతీకి చెందిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు శిథిలావస్థకు చేరాయి. వీటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. పాత బస్‌స్టాండ్‌ వద్ద వున్న ఖాళీ స్థలాన్ని వినియోగంలోకి తేవడం లేదు. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని వున్న కుళ్లీ కోనేరు, కళీం గెడ్డ ప్రక్షళనకు పూనుకోలేకపోయారు. పంచాయతీకి ఆదాయంతో పాటు ప్రజారోగ్యానికి పనికొచ్చే ఇలాంటి పనులెన్నో గాలికి వదిలేశారు. నాయకుల అధిపత్యం కోసం పాలకవర్గ సభ్యులు పని చేస్తుండడంతో కనీసం పుణ్యగిరి ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దలేకపోయారు.

కలెక్టర్‌ అనుమతి కోరతాం

సోమవారం మరోసారి పంచాయతీ సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. సభ్యులందరికీ సమాచారం అందించాను. అంతా హాజరువుతారని భావిస్తున్నాను. పుణ్యగిరి జాతర సదుపాయాల కల్పనకు అవసరమైన ఖర్చులపై చర్చిస్తాము. ఇప్పుడు కూడా సభ్యులు గైర్హాజరైతే కలెక్టర్‌కు నివేదిస్తాం. అవసరమైన నిధుల ఖర్చుకు అనుమతి తీసుకుంటాం.

చంద్రశేఖర్‌, పంచాయతీ కార్యనిర్వహణాధికారి, శృంగవరపుకోట

Updated Date - Feb 07 , 2026 | 11:51 PM