Posting there.. work here పోస్టింగ్ అక్కడ.. పని ఒక్కడ
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:12 AM
Posting there.. work here తెర్లాం తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న హేమంతకుమార్‌ను నెల క్రితం భోగాపురం మండలానికి డిప్యుటేషన్‌పై తహసీల్దార్‌గా నియమించారు.
పోస్టింగ్ అక్కడ.. పని ఒక్కడ
రెవెన్యూలో కొనసాగుతున్న డిప్యుటేషన్లు
నొచ్చుకుంటున్న తహసీల్దార్లు
డీటీలకు ఇన్‌చార్జి తహసీల్దార్ బాధ్యతలు
గత నెల నుంచీ ఇదే పంథా
విజయనగరం కలెక్టరేట్, జూలై 13(ఆంధ్రజ్యోతి): తెర్లాం తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న హేమంతకుమార్‌ను నెల క్రితం భోగాపురం మండలానికి డిప్యుటేషన్‌పై తహసీల్దార్‌గా నియమించారు. గత నెల 3న డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన ఆర్.ధనను బాడంగి తహసీల్దార్‌గా కేటాయిస్తూ తెర్లాం తహసీల్దార్‌గా డిప్యుటేషన్ వేశారు. గత నెల 24న పదోన్నతి పొందిన ఎస్.శ్రీనివాస్‌రావుకు తాజాగా భోగాపురం తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇస్తూ విజయనగరం అర్బన్ తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై నియమించారు. డిప్యుటేషన్ల తంతుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గత నెల నుంచి అనేక మంది తహసీల్దార్లకు డిప్యుటేషన్లు వేస్తూ వస్తున్నారు.
జిల్లాలోని రెవెన్యూ శాఖలో పని చేస్తున్న కొందరు తహసీల్దార్లకు పోస్టింగ్ ఒక చోట ఇచ్చారు. డిప్యుటేషన్‌తో మరో చోట విధులు నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు రోజులు కాదు నెలల తరబడి ఈ డిప్యుటేషన్లు కొనసాగుతున్నాయి. పోస్టింగు పొందిన వారిలో కొందరికి వెంట వెంటనే డిప్యూటేషన్ వేశారు. సాధారణంగా మండల స్థాయిలో కీలకమైన పోస్టులు నియమించే సమయంలో సంబంధిత నియోజకవర్గం శాసన సభ్యులకు చెబుతారన్న విమర్శ ఉంది. అట్నుంచి వచ్చే ఆదేశాల మేరకే మార్పులు జరుగుతాయన్నది బహిరంగ రహస్యం. తాజాగా జరుగుతున్న తహసీల్దార్ల డిప్యుటేషన్లు కూడా ఇదే తరహాలో సాగిస్తున్నారని వినికిడి. పోస్టింగ్ వేసిన వెంటనే డిప్యుటేషన్లు వేయడంపై కొందరు ఉద్యోగులు లోలోపల మథనపడుతున్నట్లు తెలుస్తోంది.
డీటీలే ఇన్‌చార్జి తహసీల్దార్లుగా..
వంగర, రేగిడి, బాడంగి, దత్తిరాజేరు మండలాలకు డీటీలే ఇన్‌చార్జి తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వంగర తహసీల్దార్‌గా డీఎస్‌ఎన్ జ్యోతిని చూపిస్తూ ఆమెను చీపురుపల్లి ఆర్‌డీవో కార్యాలయం ఏవోగా డిప్యూటేషన్‌పై నియమించారు. వంగర మండలానికి మాత్రం అక్కడి డీటీకి తహసీల్దార్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రేగిడి తహసీల్దార్ కృష్ణలతను జిల్లా కెఆర్‌సీసీ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించి, రేగిడి డీటీకి ఇన్‌చార్జి తహసీల్దార్ బాధ్యతలు అప్పగించారు. దత్తిరాజేరు తహసీల్దార్‌గా పోస్టింగ్ పొందిన విజయభాస్కర్‌ను మెంటాడకు డిప్యుటేషన్‌పై నియమిస్తూ అక్కడ గంట్యాడ హెచ్‌డీటీ హరికిరణ్‌కు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు. బాడంగి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా దత్తిరాజేరు హెచ్‌డీటీ నాని విఽధులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలోని పలువురు తహసీల్దార్లు పదోన్నతి పొందినా కొన్ని చోట్ల డిప్యూటీ తహసీల్దార్ల (డీటీ)కు ఇన్‌చార్జి తహసీల్దార్ బాధ్యత అప్పగించడంపై రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి చందక సత్తిబాబు వద్ద ప్రస్తావించగా పరిపాలన సౌలభ్యం కోసమే డిప్యుటేషన్లు వేసినట్లు తెలిపారు.
-------------------------------