Share News

Possession in Rajam too రాజాంలోనూ కబ్జా

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:38 PM

Possession in Rajam too కోట్లాది రూపాయలు విలువచేసే దేవదాయశాఖకు చెందిన స్థలాన్ని రెండ్రోజులుగా ఓ వ్యక్తి చదునుచేయించడాన్ని ఆ శాఖ అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వివాదం పెండింగ్‌లో ఉండగా ఏవిధంగా పనులు చేస్తారని దేవదాయశాఖ ఈవో బలివాడ వెంకట మాధవరావు పనులు చేయిస్తున్న వ్యక్తిని నిలదీశారు.

Possession in Rajam too రాజాంలోనూ కబ్జా

రాజాంలోనూ కబ్జా

దేవదాయశాఖ భూమిపై కన్ను

చదును చేయిస్తుండగా అడ్డుకున్న ఈవో

కోర్టు ధిక్కార కేసు నమోదు చేస్తామని హెచ్చరిక.

స్థలం ఖరీదు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కోట్లాది రూపాయలు విలువచేసే దేవదాయశాఖకు చెందిన స్థలాన్ని రెండ్రోజులుగా ఓ వ్యక్తి చదునుచేయించడాన్ని ఆ శాఖ అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వివాదం పెండింగ్‌లో ఉండగా ఏవిధంగా పనులు చేస్తారని దేవదాయశాఖ ఈవో బలివాడ వెంకట మాధవరావు పనులు చేయిస్తున్న వ్యక్తిని నిలదీశారు. తక్షణమే పనులు నిలుపుదల చేయకపోతే కోర్టు ధిక్కార నేరం కింద కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. దీంతో తాత్కాలికంగా పనులు నిలిపివేసిన సంఘటన రాజాం మునిసిపాలిటీ పరిధిలోని డోలపేట చెక్‌పోస్ట్‌ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.

రాజాం మునిసిపాలిటీ పరిధిలోని డోలపేటలో శ్రీ ఉమామహేశ్వర, లక్ష్మినారాయణస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 1.13 ఎకరాల స్థలం ఉంది. సారధి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఈ స్థలంలో గతంలో ఓ కాన్వెంట్‌ నిర్వహించేవారు. అప్పట్లో శ్రీకాకుళం దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్‌ అజాద్‌ ఆ స్థలం దేవదాయశాఖకు చెందినదిగా గుర్తించి కాన్వెంట్‌ను ఖాళీ చేయించారు. దేవదాయశాఖ స్థలంగా హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేయించారు. ఈ స్థలం పరిసరాలలో నిర్మించిన గృహాలపై కూడా అప్పట్లో కేసులు నమోదు చేశారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న స్థలంలో రెండ్రోజులుగా ఓ వ్యక్తి గ్రావెల్‌ వేసి చదును చేయిస్తుండడంతో దేవదాయశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్థలానికి సంబంధించి హక్కుపత్రాలుంటే న్యాయస్థానంలో పొందుపరచాలని సూచించారు. దీంతో స్థలాన్ని చదును చేయిస్తున్న వ్యక్తి తాత్కాలికంగా పనులు నిలుపుదల చేశారు. కాగా ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.20 కోట్లు పైనే ఉంటుంది.

ఫ దేవదాయశాఖకు చెందిన కోట్లాది రూపాయులు విలువచేసే స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని దేవాదాయశాఖ ఈవో బీవీ మాధవరావు వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా ఆ స్థలం ఎండోమెంట్‌కు చెందినదిగా నిర్ధారించారు. పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కొన్నేళ్లుగా ఆ స్థలవివాదం హైకోర్టులో ఉందన్నారు. పనులు కొనసాగిస్తే కోర్టు ధిక్కార నేరం కింద కేసు నమోదు చేయిస్తామని మాధవరావు స్పష్టం చేశారు.

Updated Date - Feb 10 , 2026 | 11:38 PM