population wanted ప్రభం‘జనం’ కావాలి
ABN , Publish Date - May 19 , 2026 | 12:01 AM
population wanted ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు నినాదం గతం.. ముగ్గురే కాదు నలుగురైనా పర్వాలేదు అనేది నేటి లక్ష్యం. మెరుగైన భవిష్యత్‌కు జనాభా అవసరమని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలు కనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడమే కాదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. సరికొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా వేదికలపై పిలుపునిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయంపై మాట్లాడారు.
ప్రభం‘జనం’ కావాలి
జనాభా పెరుగుదలకు ప్రభుత్వ ప్రోత్సాహకం...!
మూడో బిడ్డకు రూ.30వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు
ఒకరిద్దరు చాలు అనేది గతం మాట
ముగ్గురు నలుగురు ఉండాలనేది నేటి మాట
స్వయంగా సీఎం చంద్రబాబే పిలుపు
ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు నినాదం గతం.. ముగ్గురే కాదు నలుగురైనా పర్వాలేదు అనేది నేటి లక్ష్యం. మెరుగైన భవిష్యత్‌కు జనాభా అవసరమని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలు కనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడమే కాదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. సరికొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా వేదికలపై పిలుపునిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయంపై మాట్లాడారు.
- ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రచారం చేసిన నేను ఇప్పుడు జనాభా పెంపును ప్రోత్సహిస్తున్నాను. మూడో సంతానం కలిగిన వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు అందిస్తాం. పిల్లలే మన అసలైన సంపద. జనాభా పెరిగితేనే భవిష్యత్‌లో అభివృద్ధికి అస్కారం. అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.15వేలు అందించే తల్లికు వందనం పథకం నాకు సంతృప్తినిచ్చింది. భగవంతుడు కరుణించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఈ సాయాన్ని భవిష్యత్‌లో మరింత పెంచుతాం
- శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రజా వేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటన
శృంగవరపుకోట, మే 18(ఆంధ్రజ్యోతి):
జనాభా నియంత్రణకు ఇన్నాళ్లు పాటుపడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జనాభా పెరుగుదలకు తపిస్తోంది. ఇందుకోసం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని సహసోపిత నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి నూతన పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. స్వయంగా సీఎం ప్రతి సందర్భంలోనూ పలు వేదికలపై సంతానోత్పత్తితో కలిగే భవిష్యత్ ప్రయోజనాలను గుర్తుచేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ ప్రత్యేకంగా దీనిపై మాట్లాడారు. మూడో బిడ్డను కన్న తల్లిదండ్రులకు రూ.30వేలు, బిడ్డపోషణకు ఐదేళ్లపాటు నెలకు రూ.1000, 18ఏళ్లవరకు ఉచిత విద్య, ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు. తల్లికి 12నెలలు, తండ్రికి రెండు నెలలు ఇవ్వనున్నారు. చైల్డ్ కేర్ సెంటర్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు వంటి వాటిని కూడా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
జనాభా పెరుగుదల కారణంగా సంపద సృష్టి తగ్గడంతో ఐదు దశాబ్దాల కిందట జనాభా తగ్గుదలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరిగాయి. ఇందుకు అనుగుణంగా మనదేశంలోనూ కుటుంబ నియంత్రణకు అడుగులు పడ్డాయి. ఒక్కరిద్దరితో సరిపెట్టుకున్న కుటుంబాలకు అనేక రకాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించింది. ఈ విధానంతో కాలక్రమంలో జనాభా తగ్గింది. ఇప్పుడు జనాభా తగ్గుదలతో ఇబ్బందులు పడుతున్న కొన్ని దేశాలను దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం జనాభా పెరుగుదల కోసం మార్గాలను వెతుకుతోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ల కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం)లకు టార్గెట్‌ను విధించే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఐదేళ్లగా మౌనం వహించింది. ఒకరిద్దరు పిల్లలతో అపరేషన్ చేసుకొనేందుకు ముందుకు వచ్చిన దంపతులను ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు పట్టించుకోవడం మానేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించాలని అడిగిన దంపతులను ఏఎన్‌ఎంలు తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ఆపరేషన్‌లు చేయడం రాదని బహిరంగంగా చెబుతున్న వైద్యులకు కొదవ లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లోను, ప్రసవ సమయంలో జరిగే సర్జరీల్లో వైద్యులను బతిమాలుకోవడంతో పాటు వారడిగే సొమ్మును ముట్టజెప్పి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేసుకుంటున్నారు. ఈ పరిణామంతో జనాభా వృద్ధి అంతకంతకూ తగ్గుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా ఉండడం లేదు. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శ్రమ శక్తికి ఉపయోగించే యువకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
జిల్లాలో గత మూడేళ్లలో స్థూల జనన రేటు
జిల్లాలో 2022-2023లో టీఎఫ్‌ఆర్ (ఫెర్టిలిటీ రేటు) 1.72 ఉండగా 2023-2024లో 1.72 నమోదైంది. 2024-2025లో మాత్రం 1.71కు దిగజారింది. అయితే స్థూల జనన రేటు సరిగానే ఉంది. ఒకరు, ఒకరుకంటే ఎక్కువ సంతానోత్పత్తి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2011లో జనగణన జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 34 మండలాల్లో 23.44 లక్షల జనాభా ఉండేది. అప్పట్లో చిన్నపిల్లలు 7.10 లక్షలు, యువకులు 14.23 లక్షలు, వృద్ధులు 2.11 లక్షలు ఉండేవారు. జిల్లా విభజన తరువాత ప్రస్తుతం 27 మండలాలే ఉన్నాయి. 2021లో జరగాల్సిన జనగణన కొవిడ్ కారణంగా జరగలేదు. ప్రస్తుతం జిల్లా జనాభా 19.30లక్షలు ఉంటుందని అంచనా. ఇందులో పిల్లలు 2.31లక్షలు, యువకులు 9.25లక్షలు, వృద్ధులు 7.74 లక్షలు ఉంటారని అంచనా. ఈ ప్రకారం సంపాదించే శక్తి వున్న యువత సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇంకొకరిపై ఆధారపడి జీవనం సాగించే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. పిల్లలు, వృద్ధులు సంపాదించేవారిపై ఆధారపడుతున్నందున ఆర్థిక పరిస్థితి గాడి తప్పే ప్రమాదం ఉంది.
ఫ ఉమ్మడి రాష్ట్రంలో టీఎఫ్‌ఆర్ 3.0గా ఉండేది. ఇప్పుడు విభజిత రాష్ట్రం మొత్తం మీద 1.5 సంతానోత్పత్తి(టీఎఫ్‌ఆర్- ఫెర్టిలిటీ రేట్)వుంది.. అంటే ఇద్దరు కంటే తక్కువ జననాలు నమోదవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇలా టీఎఫ్‌ఆర్ తగ్గుతూ వస్తే వర్క్‌ఫోర్స్ పడిపోతుందని, దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించారు. ఒకరిద్దరి పిల్లలతో ఆపేయకుండా ఇద్దరు, ముగ్గురు ఆపైన పిల్లలను కనేందుకు తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
దేశంలోనే తొలిసారి
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తోంది. ప్రజల్లో చర్చ పెట్టింది. మూడో సంతానం కన్న కుటుంబాలకు డెలివరీలోనే రూ.30వేలు అందించనున్నారు. పిల్లలు లేకుండా బాధపడుతున్న తల్లిదండ్రులకు ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కు కూడా ప్రభుత్వం సహకారం అందించే దిశగా ఆలోచిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ విధానంలో ఐవీఎఫ్ సెంటర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా తగు వైద్య సేవలు అందించాలనుకుంటోంది.
జనాభా పెరుగుదల అవసరం
రాష్ట్రంలో జనాభా పెరుగుదల అవసరం. గ్రామాల్లో నివశిస్తున్న కుటుంబాల్లో ఒక్కరి సంపాదన మీద నలుగురు వరకు జీవిస్తున్నారు. దీంతో కుటుంబ ఆర్థిక స్థితిగతులు పెరగడం లేదు. అలాగే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కన్న కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులుంటాయి. ప్రభుత్వం సాయం చేయాలి.
పి.వెంకటరమణ రైతు, అరిగిపాలెం, వేపాడ మండలం
మంచి ఆలోచన
యువ శక్తిని పెంచాలి. ఇందుకు మార్గం జనన రేటును పెంచడమే. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఏపీ ముందుడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూలప్పుడు ఆదాయాన్ని బట్టి వసూలు చేస్తుంది. నిధులు ఇచ్చేటప్పుడు జనాభా ప్రాతిపాదికన ఇస్తుంది. ఎక్కువ జనాభా వున్న రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
బి.రామకృష్ణ, పర్యావరణ ప్రేమికుడు, శృంగవరపుకోట
-------------------