Share News

poor god 42 ఎకరాలున్నా.. నైవేద్యం కరువాయె

ABN , Publish Date - May 17 , 2026 | 12:18 AM

poor god దేవుడు భూములకే రక్షణ కరువైంది. 42 ఎకరాలుంటే పైసా శిస్తు రావడం లేదు. ఆక్రమణదారులు చెల్లించాలనుకోవడం లేదు. పైగా పూర్తిగా స్వాధీనం చేసుకునే ఎత్తుగడలో ఉన్నట్లు తెలిసింది. రికార్డులు మార్చే పనిలో నిమగ్నమయ్యారు.

poor god 42 ఎకరాలున్నా..  నైవేద్యం కరువాయె
రామలింగేశ్వరస్వామి ఆలయం

42 ఎకరాలున్నా..

నైవేద్యం కరువాయె

రామలింగేశ్వర స్వామికి కానరాని దీపధూపాలు

దేవదాయ భూములపై పెద్దల కన్ను

ఆక్రమణలకు వ్యూహాలు

రికార్డులు మార్చేందుకు రాజధాని పయనం

ఆ భూముల విలువ రూ.20కోట్లపైనే

శిస్తులన్నీ ఎగనామం

దేవుడు భూములకే రక్షణ కరువైంది. 42 ఎకరాలుంటే పైసా శిస్తు రావడం లేదు. ఆక్రమణదారులు చెల్లించాలనుకోవడం లేదు. పైగా పూర్తిగా స్వాధీనం చేసుకునే ఎత్తుగడలో ఉన్నట్లు తెలిసింది. రికార్డులు మార్చే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు దీపధూప నైవేద్యాలతో ఒకప్పుడు కళగా ఉండే స్వామికి నేడు కళ తప్పింది. ఆదాయం లేక అర్చకుడు అతి కష్టం మీద ఆలయ బాగోగులు చూస్తున్నాడు. అక్కడి పరిస్థితిని అటుగా వచ్చే భక్తులకు తెలియజేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. నడుపూరు రామలింగేశ్వర స్వామికి ఆలయ దుస్థితిది.

గుర్ల, మే 16(ఆంధ్రజ్యోతి):

నడుపూరు రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే చుట్టుపక్కల గ్రామాల భక్తులకు ఎంతో నమ్మకం. దేవతలు నిర్మించిన ఆలయంగా చెబుతారు. కార్తీకమాసంలో తప్పకుండా దర్శించుకుంటారు. ఆ నెల రోజులూ ఆలయం కిటకిటలాడుతుంటుంది. ఆ తర్వాత మాత్రం వెలవెలబోతోంది. సోమవారాల్లోనే భక్తులు కాస్త వస్తుంటారు. కనీస ఆదాయం రావడం లేదు. ఆలయ అర్చకుడిగా నారాయణమూర్తి సేవలందిస్తున్నారు. ఈయన 365రోజులూ దీపం వెలిగించి నైవేద్యం పెట్టి వస్తుంటారు. అతనికి ఎటువంటి ఆదాయం లేదు. సొంత ఖర్చుతో స్వామిపై భక్తితో పూజ చేస్తుంటాడు. ఆలయం ఆస్తుల విషయానికొస్తే సర్వే నెంబరు-2లో భోపాలపురం నడుపూరు రెవెన్యూ పరిధిలో సుమారు 43 ఎకరాలు ఉన్నాయి. వాటిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సాగుచేసుకుంటున్నారు. గతంలో ఆ భూములపై ఎంతో కొంత శిస్తు అందజేసేవారు. కొన్నాళ్లుగా చెల్లించడం లేదు. కొంతమంది దాతలు ముందుకొచ్చి శివాలయాన్ని కొంత అభివృద్ధి చేసి ఉన్నారు. ముఖ్యంగా నడుపూరు గ్రామం నుంచి ఆలయానికి రహదారి లేదు. కనీసం మట్టి రోడ్డు వేయాలని భక్తులు కోరుతున్నారు.

- ఆలయ భూములు కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. వారే అప్పటి నుంచి ఇప్పటివరకు సాగుచేస్తున్నారు. అయితే ఆ భూములపై ఇంకొంతమంది వ్యక్తుల కన్నుపడింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనతో ఆ భూములను సొంతం చేసుకోవాలని వ్యూహం పన్నారు. రికార్డులు తారుమారు చేసి ఆక్రమించుకోవాలని పన్నాగంపన్నారు. ఇదే పని మీద రాజధానికి ప్రయాణమై ఉన్నతాధికారులను కలిసి రికార్డులు మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు భోగట్టా.

- ఒకప్పుడు రామలింగేశ్వర స్వామి ఆలయానికి కమిటీ సభ్యులు, చైర్మన్‌ ఉండేవారు. నేడు ఎవరూ లేక ఆలయ బాగోగులు చూసుకునే నాథుడు కరువయ్యాడు.

మా తాత తండ్రుల నుంచి...

ఆలయ అర్చకులుగా మా తాతతండ్రుల నుంచి ఉంటున్నాం. వంశపారంపర్యంగా పనిచేస్తున్నాం. కానీ ఆలయ అభివృద్ధికి నోచుకోలేదు. ఆస్తులున్నా కనీసం దేవదాయశాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇక్కడ ఆలయ అభివృద్ధి చేస్తే సుమారు పది గ్రామాల నుంచి భక్తులు వస్తారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఆలయ భూములను కాపాడి వాటితోనే ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు.

- నారాయణమూర్తి, అర్చకుడు

గ్రామస్థులంతా పనిచేశారు

ఆలయ అభివృద్ధి కోసం అప్పట్లో గ్రామస్థులంతా ఏకమై పనిచేశారు. తరువాత వదిలేశారు. భూములు ఉన్న మాట వాస్తవమే. కానీ శిస్తులు మాత్రం చెల్లించడం లేదు. వాటిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టిసారించి పురాతన ఆలయాన్ని కాపాడాలి.

రాము, ఆలయ మాజీ చైర్మన్‌

Updated Date - May 17 , 2026 | 12:18 AM