Polytechnic Is Calling పాలిటెక్నిక్ పిలుస్తోంది
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:22 AM
Polytechnic Is Calling పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులు ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తున్నాయి. జీవితంలో త్వరగా స్థిరపడేందుకు దన్నుగా నిలుస్తున్నాయి. పాలిటెక్నిక్‌లో పలు బ్రాంచీల్లో చేరే వారు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందొచ్చు. స్వయం ఉపాధి, ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు.
మరో నాలుగు రోజులే గడువు
కోర్సు పూర్తవ్వగానే ఉపాధి అవకాశాలు
జియ్యమ్మవలస, మార్చి31(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులు ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తున్నాయి. జీవితంలో త్వరగా స్థిరపడేందుకు దన్నుగా నిలుస్తున్నాయి. పాలిటెక్నిక్‌లో పలు బ్రాంచీల్లో చేరే వారు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందొచ్చు. స్వయం ఉపాధి, ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు. జిల్లాలో చినమేరంగి, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, పార్వతీపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా పదుల సంఖ్యలో ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ వంటి డిప్లొమో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమో పూర్తి చేసిన వారు ఉద్యోగావకాశాలు పొందే వీలుంది. లేకుంటే నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. ‘ డిప్లొమో కోర్సులతో విద్యార్థులకు ఏఐ , సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి రంగాల్లో ఉజ్వల భవిష్యత్ ఉంది. ఏదో ఒక కోర్సు పూర్తి చేసుకుంటే చిన్న వయసులోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం సంపాదించొచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ’ అని చినమేరంగి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఇంగ్లీషు లెక్చరర్ సీహెచ్ అప్పలనాయుడు తెలిపారు.
దరఖాస్తు ఇలా..
పాలిసెట్ 2026కు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునేందుకు మరో మరో నాలుగు రోజుల సమయమే మిగిలింది. ఆసక్తి ఉన్న వారు ముందుగా పీవోఎల్‌వైసీఈటీఏపీ.ఏపీ. జీవోవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో ఏపీ పాలిసెట్ 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబరు , ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టెన్త్‌క్లాస్ హాల్ టిక్కెట్ నెంబరు, వ్యక్తిగత వివరాలు పొందుపర్చాలి. అప్లికేషన్ ఫార్మ్‌ను చాలా జాగ్రత్తగా నింపాలి. ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఆ తరువాత సబ్‌మిట్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈనెల 4లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి.
పరీక్షా విధానం ఇలా..
ఏపీ పాలిసెట్-2026కు సంబంధించి ప్రవేశ పరీక్ష ఈనెల 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. మొత్తం 120 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో గణితం 50 ప్రశ్నలు, ఫిజిక్స్ 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ 30 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. డిప్లొమో కోర్సుల్లో చేరడానికి పాలిటెక్నిక్ ఉమ్మడి పరీక్ష (పాలీసెట్)లో అర్హత పొందాలి. సాధించిన ర్యాంకుల ఆధారంగా కాలేజీల్లోని కోరుకున్న కోర్సులో చేరవచ్చు.