Share News

Polling today నేడే పోలింగ్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:18 AM

Polling today తొలి విడత పంచాయతీల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఫేజ్‌-1 పరిధిలో బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో సర్పంచి పదవులకు గురువారం పోలింగ్‌ జరుగనుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Polling today నేడే పోలింగ్‌
బొబ్బిలి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బంది

నేడే పోలింగ్‌

తొలి విడత పంచాయతీల్లో ఓట్ల పండుగ

బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో నిర్వహణ

221 పంచాయతీలు, 2018 వార్డులకు ఎన్నికలు

పోలింగ్‌, కౌటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

విజయనగరం/ కంటోన్మెంట్‌, నవంబరు 25, (ఆంధ్రజ్యోతి):

తొలి విడత పంచాయతీల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఫేజ్‌-1 పరిధిలో బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో సర్పంచి పదవులకు గురువారం పోలింగ్‌ జరుగనుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఓటు వేసుకొనేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమయం కేటాయించింది. అనంతరం రెండు గంటలకు లెక్కింపు ప్రక్రియను చేపట్టి ఫలితాలను అక్కడికక్కడే ప్రకటిస్తామని జిల్లా పంచాయతీ అధికారి డీవీ మల్లిఖార్జునరావు తెలిపారు. వివాదాలకు తావులేకుండా పోలింగ్‌ను నిర్వహించేలా కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బొబ్బిలి నియోజక వర్గంలోని బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలతో పాటు ఎస్‌.కోట నియోజకవర్గంలోని ఎస్‌.కోట, కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ కలిపి 8మండలాలకు తొలి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని మల్లిఖార్జునరావు తెలిపారు.

185 పంచాయతీలు.. 429 మంది అభ్యర్థులు

తొలివిడతలో ఎన్నికల్లో 221 పంచాయతీలకు 36 ఏకగ్రీవం పోగా మిగిలిన 185 పంచాయతీలకు సర్పంచ్‌ అభ్యర్థులుగా 429 మంది బరిలో నిలిచారు. 1453 వార్డులకు 3013 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.

- పోలింగ్‌ నిర్వహణకు 5983 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో 2325 మంది పీఓలు (ప్రిసైడింగ్‌ అధికారులు), ఓపీఓలు (అదనపు పోలింగ్‌ అధికారులు) ఉన్నారు. పర్యవేక్షణ కోసం 32 జోన్లు, 72 రూట్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది , సామగ్రి తరలింపునకు 95 బస్సులు, 110 చిన్నవాహనాలు వినియెగిస్తున్నారు. 3073 బ్యాలట్‌ బాక్సులను అందుబాటులో ఉంచారు.

జోన్లు, రూట్ల వర్గీకరణ ఇలా....

మండలం పంచాయతీలు పోలింగ్‌ స్టేషన్లు జోన్లు రూట్లు

1. బాడంగి 25 240 4 8

2. బొబ్బిలి 30 292 4 9

3.రామభద్రపురం 22 212 3 8

4.కొత్తవలస 25 266 5 9

5.ఎల్‌.కోట 31 288 3 10

6. ఎస్‌.కోట 26 272 4 8

7. వేపాడ 29 268 4 10

8. తెర్లాం 33 310 5 10

======== ======

ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):

మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సమర్థంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సూచించారు. బొబ్బిలి మండలంలోని 30, బాడంగిలో 25, తెర్లాంలో 33, రామభద్రపురంలో 22, కొత్తవలసలో 25, ఎల్‌.కోటలో 31, ఎస్‌.కోటలో 20 మొత్తం 221 పంచాయతీలు... 2,108 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌కు ఎన్నికల సిబ్బంది విధుల కేటాయింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలకు పీవోలు, ఏపీవోలు, ఇతర సిబ్బంది సకాలంలో చేరుకోవాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు, అవసరమైన ఏర్పాట్లను ముందుగా పూర్తి చేయలన్నారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్‌, డీఆర్‌వో సత్తిబాబు, డీపీవో మల్లిఖార్జున రావు తదితరులు ఉన్నారు.

ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

విజయనగరం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):

పంచాయతీ ఎన్నికలతో పాటు రాజాం పురపాలక సంఘానికి గురువారం జరుగుతున్న ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి ఎన్నికల ప్రచారం చేయడం, స్థానిక ఓటర్లను ప్రభావితం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్షణమే స్థానికేతరులు గ్రామాలను ఖాళీచేసి వెళ్లిపోవాలని ఎస్పీ సూచించారు.

గైర్హాజరైన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

ఆగ్రహించిన కలెక్టర్‌ రామసుందర రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 25(ఆంఽద్రజ్యోతి): రాజాం మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల విధులకు కేటాయించిన అఽధికారులు, సిబ్బంది ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా బుధవారం విధులకు రాకపోవడంపై కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాం మునిసిపాలిటీ ఎన్నికల విధులకు సంబంధించి ఒక ఏపీవో, ఆరుగురు ఓపీవోలు... పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముగ్గురు రిటర్నింగ్‌ అధికారులు, 47 మంది పీవోలు, 89 మంది అదనపు పోలింగ్‌ అధికారులు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఇది బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చూపినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Nov 26 , 2026 | 12:18 AM