Polling Today నేడే పోలింగ్
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:31 PM
Polling Today పుర పోరకు సర్వం సిద్ధమైంది. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.
పార్వతీపురం, సాలూరు, పాలకొండలో ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
600 మంది పోలీసులతో బందోబస్తు
పార్వతీపురం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పుర పోరకు సర్వం సిద్ధమైంది. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ 600 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాగా ఈనెల 3న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
పార్వతీపురంలో...
పార్వతీపురంలో 36 వార్డుల్లో ఉన్న 40,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 19482 మంది, మహిళలు 21,279 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. 63 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో 140 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. 424 మంది పోలింగ్ సిబ్బంది, 13 మంది ఎన్నికల అధికారులు, 24 మంది సహాయక ఎన్నికల అధికారులను నియమించారు. 9 మంది రూట్ అధికారులను రిజర్వ్ చేశారు. వార్డులను ఐదు జోన్లుగా విభజించి ఐదుగురు జోనల్ అధికారులను నియమించారు. సుమారు 400 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పాల్గొనున్నారు. ఎనిమిది మంది రూట్ ఆఫీసర్లు, ఐదుగురు జోనల్ అధికారులు పర్యవేక్షించనున్నారు.
సాలూరులో ...
సాలూరులో 32 వార్డులకు ఉండగా.. 41,934 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు 62 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 200 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. 450 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఇందులో 62 మంది ప్రిసైడింగ్ అధికారులు, 33 మంది సహాయక ఎన్నికల అధికారులు ఉన్నారు. ఏడుగురు ప్రిసైడింగ్ అధికారులను రిజర్వ్‌లో ఉంచారు. పురపాలక సంఘంలో వార్డులను ఆరు జోన్లుగా విభజించి.. ఆరు రూట్లు ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు.
పాలకొండలో..
పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 23,466 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1453 మంది పురుషులు, 12012 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు. మొత్తం 28 వార్డులకు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 59 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. 30 మంది పీవో, 30 మంది ఏపీవోలను నియమించారు. ఆరుగురు సహాయక ఎన్నికల అధికారులను రిజర్వ్‌లో ఉంచారు. నగర పంచాయతీ పరిధిలో వార్డులను ఐదు రూట్లగా విభజించి.. మూడు జోన్లు ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా 120 మంది ఓపీవోలను నియమించారు. డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో 210 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
చైర్‌పర్సన్ అభ్యర్థులు వీరే..
- పార్వతీపురం మున్సిపాల్టీలో చైర్‌పర్సన్ రేసులో నలుగురు ఉన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా 122 మంది బరిలో ఉన్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థులుగా టీడీపీ నుంచి బెలగాం కరుణ, వైసీపీ నుంచి పి.సాయిశ్రీ, కాంగ్రెస్ నుంచి పాలకొండ సంధ్య, ఇండిపెండెంట్‌గా పూసర్ల లలిత పోటీలో ఉన్నారు.
- సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 85 మంది వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. చైర్‌పర్సన్ పదవికి ఆరుగురు పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా గుళ్ల మంజీరా, లచ్చు బత్తుల కల్పన, నిమ్మాది శ్యామల, జనసేన నుంచి గొర్లె విజయకుమారి, వైసీపీ నుంచి రిబ్కారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి సిగడాపు ధనలక్ష్మి బరిలో ఉన్నారు.
- పాలకొండ నగర పంచాయతీలో చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. జనసేన నుంచి పల్లా విజయనిర్మల, వైసీపీ నుంచి పాలవలస ఇందుమతి, స్వతంత్య్ర అభ్యర్థిగా భాసూరు శ్రీదేవి బరిలో చేస్తున్నారు. ఇక 28 వార్డుల్లో 63 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 19వ వార్డు జనసేనకు ఏకగ్రీవమైనట్లు తెలిసింది.