Polling in Rajam is peaceful. రాజాం పోలింగ్ ప్రశాంతం
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:37 AM
Polling in Rajam is peaceful.
రాజాం పోలింగ్ ప్రశాంతం
65.73 శాతం ఓటింగ్ నమోదు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు తేజ్‌భరత్
రాజాం / రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):
రెండు దశాబ్దాల తరువాత గురువారం జరిగిన రాజాం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పాతికేళ్ల తరుపాత మునిసిపల్ పరిధిలోని రాజాం, సారధి, కొత్తవలస, కొండంపేట, పొనుగుటివలస గ్రామాల ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 32 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన 49 పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండుగంటలు నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత జోరందుకుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 31వ వార్డులో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకూ భారీ క్యూ కనిపించింది. ఆ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థులిద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అత్యధికంగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. చైర్‌పర్సన్ పదవికి జనసేన, వైసీపీతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉండగా 32 వార్డులలో 89 మంది ఎన్నికల బరిలో నిలిచారు.
ఓటింగ్ సరళి ఇలా..
ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మునిసిపాలిటీలో 36,787 మంది ఓటర్లున్నారు. ఉదయం తొమ్మిది గంటల సమయానికి 5684 మంది ఓటర్లు (15.45 శాతం) ఓటుహక్కును వినియోగించుకోగా పదిగంటలకు ఆ సంఖ్య 8416 (22.85 శాతం)కి చేరింది. 11 గంటలకు 12,018 మంది (32.87 శాతం) ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఒంటిగంట సమయానికి 18,117 మంది ఓటర్లు ఓటు వేయడంతో పోలింగ్ 49.29 శాతానికి చేరింది.. సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికలు ముగిసే సమయానికి 65.73 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటు వేసిన ప్రముఖులు
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తన సతీమణి శ్రీలక్ష్మితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 9వ వార్డులో ఓటుహక్కును వినియోగించుకున్నారు. జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థినిగా ఎన్నికల బరిలో ఉన్న బేరు సౌజన్యలత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 16వ వార్డులో ఓటు వేశారు. వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిని పాలవలస పద్మావతి 10వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
అధికారుల సందర్శన
ఎన్నికల పరిశీలకుడు తేజ్‌భరత్ సెయింటాన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంతో పాటు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ అధికారులతో మాట్లాడారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు, జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్ రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో కలిసి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఏఎస్పీ హంగామా
విజయనగరం ఏఎస్పీ (ఏ.ఆర్.,) కిరణ్‌కుమార్ రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో ఉన్న పది నిమిషాలలో కొద్దిసేపు హంగామా చేశారు. పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రింట్ మీడియా పాత్రికేయులు కూడా ఉండకూడదని హుకుం జారీ చేశారు. కలెక్టర్ జారీచేసిన అక్రిడిటేషన్ చూపించే ప్రయత్నం చేసినా.. వాదించొద్దు బయటకు పొమ్మని అసహనాన్ని ప్రదర్శించారు. దీంతో ఏఎస్పీ ఉన్నంతసేపూ ప్రింట్‌మీడియా ప్రతినిధులు బయట ఉండాల్సి వచ్చింది.
వీల్‌చైర్లో.. ఓటుకోసం..
- పట్టణంలోని గొల్లవీధికి చెందిన 110 ఏళ్ల ఆవాల ఎల్లమ్మ రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 31వ వార్డులో ఓటు వేశారు. ఈమెను వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రానికి తరలించారు.
- పట్టణానికి చెందిన మానసిక వికలాంగుడు వెంకటరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 31వ వార్డులో ఓటు వేశారు.
- డోలపేటలోని మారుతీనగర్‌కు చెందిన 101 ఏళ్ల పొట్నూరు అప్పారావు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- పట్టణంలోని గొల్లవీధికి చెందిన నాగళ్ల ఆదినారాయణ కృత్రిమ కాలుతో ఓటేసేందుకు వచ్చారు.