Share News

Road Works రోడ్డు పనులపై రాజకీయం

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:14 AM

Politics Over Road Works మక్కువలో చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. నిర్మాణం నిలిచిపోవాలని వైసీపీ నేతలు యత్నిస్తుంటే.. ఎలాగైన పనులు పూర్తిచేసి మక్కువలో పట్టు సంపాదించాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 Road Works రోడ్డు పనులపై రాజకీయం
మక్కువ మెయిన్‌ రోడ్డు

  • నిర్మాణం పూర్తికి టీడీపీ చర్యలు

మక్కువ రూరల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మక్కువలో చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. నిర్మాణం నిలిచిపోవాలని వైసీపీ నేతలు యత్నిస్తుంటే.. ఎలాగైన పనులు పూర్తిచేసి మక్కువలో పట్టు సంపాదించాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవంగా మక్కువ మెయిన్‌రోడ్డులో 1.8 కిలోమీటర్ల మేర విస్తరణ, రహదారి, కాలువల నిర్మాణానికి రూ.2.65కోట్లు మంజూరయ్యాయి. వాటి పనులకు ఇటీవల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. కాగా 1974లో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం అవసరమైన భూమిని కొనుగోలు చేసింది. మజ్జిగౌరమ్మ దేవాలయం నుంచి నాలుగురోడ్ల జంక్షన్‌ వరకు 60 అడుగులు, నాలుగురోడ్ల జంక్షన్‌ నుంచి సువర్ణముఖి నదివంతెన వరకు 100 అడుగుల స్థలాన్ని అప్పట్లో కొనుగోలు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆ మేరకే రోడ్డు పనులు, విస్తరణ చేపట్టేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధమయ్యారు. అయితే ఎన్నో ఏళ్లుగా రోడ్డుపక్కన స్థలాలను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న కొంతమంది ఇటీవల మంత్రి సంధ్యారాణిని కలిశారు. 100 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తే తమ షాపులు పోతాయని, రోడ్డున పడతామని విన్నవించారు. 70 అడుగుల మేర విస్తరణ చేపట్టాలని మంత్రిని కోరారు. సుమారు 150మంది షాపుల యజమానులు సమస్యలను తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి సానుకూలంగా స్పందించారు. నాలుగురోడ్లు జంక్షన్‌ నుంచి సువర్ణముఖి నది వరకు రోడ్డుకు ఇరువైపులా 10 అడుగుల చొప్పున తగ్గించి 80 అడుగుల వరకు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. మక్కువలో వ్యాపారులు కోరిన మేరకు విస్తరణ పూర్తయితే టీడీపీ పట్టుసాధించే అవకాశం ఉండడంతో మెయిన్‌ రోడ్డులో 100 అడుగుల మేర విస్తరణ పనులు చేపట్టాలని ఇటీవల ఆర్‌అండ్‌బీ అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ రోడ్డు విస్తరణకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.7కోట్లు మంజూరు కాగా మార్కింగ్‌ కూడా ఇచ్చినట్లు వారు వాదిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం కొందరు వ్యాపారులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఎన్ని రాజకీయాలు చేసినా వ్యాపారులు కోరిన మేరకే విస్తరణ పనులు జరుగుతాయని మరోవైపు స్థానిక టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీ నేతల వద్ద చెడ్డవకుండా కొంతమంది వ్యాపారులు చాకచక్యంగా వ్యహరిస్తున్నారు. తమ పనులు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. మొత్తంగా మక్కువ రోడ్డు పనులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి .

Updated Date - Feb 12 , 2026 | 12:14 AM