Share News

పోలీసుల సమయస్ఫూర్తి.. డ్రైవర్‌ నిజాయితీ

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:38 AM

ఆర్టీసీ బస్సులో బంగారం, నగదు పోగొట్టుకున్న ఓ మహిళ.. పోలీసుల సమయస్ఫూర్తి, డ్రైవర్‌ నిజాయితీ వల్ల తిరిగి వాటిని పొందగలిగింది.

 పోలీసుల సమయస్ఫూర్తి.. డ్రైవర్‌ నిజాయితీ

  • ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న బంగారం, నగదును తిరిగి పొందిన మహిళ

రాజాం రూరల్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో బంగారం, నగదు పోగొట్టుకున్న ఓ మహిళ.. పోలీసుల సమయస్ఫూర్తి, డ్రైవర్‌ నిజాయితీ వల్ల తిరిగి వాటిని పొందగలిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్వాతి రాజాం మండలం కంచరాం గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చేందుకు ఆదివారం ఉదయం బయలుదేరి సాయంత్రం రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు దిగి, కంచరాంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న స్వాతి ఒకటిన్నర తులాల బంగారం నక్లెస్‌, రూ.7972 నగదు ఉన్న చిన్నబ్యాగ్‌ పోయిందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ నవీన్‌కుమార్‌ ఆదేశాల మేరకు సిబ్బంది కాంప్లెక్స్‌ ప్రాంతంలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. స్వాతి ప్రయాణించిన బస్సును గుర్తించి ఆ బస్సు డ్రైవర్‌ నాగరాజుతో మాట్లాడారు. ఆ సమయంలో డ్రైవింగ్‌లో ఉన్న నాగరాజు బస్సును ఓ పక్కన ఆపి.. బస్సులో పరిశీలించారు. సీటు కింద పర్స్‌ ఉండడాన్ని గుర్తించారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తిరిగి పాలకొండ చేరుకు న్న నాగరాజు డిపోలో బస్సు పెట్టి, విషయాన్ని డిపో మేనేజర్‌కు వివరించారు. డీఎం సూచన మేరకు సోమవారం ఉదయం మరో ఇద్దరు ఆర్టీసీ సిబ్బందితో కలిసి రాజాం టౌన్‌ సీఐ నవీన్‌కుమార్‌కు బంగారం, నగదు ఉన్న పర్స్‌ను అందజేశారు. వెంటనే స్వాతిని పిలిపించి సీఐ ఆ పర్స్‌ను అందజేశారు. దీంతో డ్రైవర్‌ నాగరాజును, సీఐ నవీన్‌కుమార్‌ చొరవను అందరూ అభినందించారు.

Updated Date - Aug 25 , 2026 | 12:38 AM