పోలమాంబ దీవించమ్మా!
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:29 PM
శంబర పోలమాంబ దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది.
-అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన ఆలయం
మక్కువరూరల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): శంబర పోలమాంబ దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, రాజాం, తెర్లాం తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి కూలైన్లలో బారులు తీరారు. కొందరు భక్తులు చదురు గుడి ఆవరణలోనే కోళ్లతో మొక్కి ముడుపులు చెల్లించుకున్నారు. చీర, జాకెటుతో పాటు పసుపు కుంకుమతో పోలమాంబకు పూజలు జరిపారు. భక్తుల రద్దీ పెరగడంతో చదురుగుడి వద్ద స్వల్ప తోపులాట జరిగింది. వెంటనే దేవదాయశాఖ సిబ్బంది స్పందించి భక్తులు సజావుగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. అనంతరం భక్తులు వనంగుడికి చేరుకుని అక్కడ కూడా పోలమాంబను దర్శించుకొని ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. వనంగుడి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ట్రస్టీ బోర్డు చైర్మన్ నైదాన చినతిరుపతి, ఆలయ కార్యనిర్వాహణాధికారి బి.శ్రీనివాస్ దగ్గరుండి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కొంతమంది భక్తులు ఎడ్లబండ్లతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని విడిదిచేశారు. వంటలు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. కాగా, ఈ నెల 26 నుంచి శంబర జాతర ప్రారంభం కానుంది.
శంబర జాతరకు 222 బస్సులు
ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న శంబర పోలమాంబ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 222 బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని సాలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పి.ఆచారి తెలిపారు. ఈ మేరకు బస్సుల పార్కింగ్‌కు సంబంధించి అవసరమైన స్థలాలను మంగళవారం ఆయన శంబరలో పరిశీలించారు. వనంగుడి సమీపంలో ఒగిరెడ్డి మన్మథరావుఅనే రైతుకు చెందిన స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఆచారి విలేకరులతో మాట్లాడుతూ.. విజయనగరం, పార్వతీపురం, ఎస్.కోట, పాలకొండ, శ్రీకాకుళం డిపోల నుంచి 222 బస్సులను నడిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. 26న 30 బస్సులు, 27న 160బస్సులు, 28న 25 బస్సులను నడుపుతామని అన్నారు. రాజాం, పాలకొండ, బొబ్బిలి, బలిజిపేట, చినభోగిలి, మామిడిపల్లి, మక్కువ, రామభద్రపురం ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శంబర పోలమాంబ భక్తులకు సులభమైన ప్రయాణం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మక్కువ మీదుగా వచ్చే బస్సులు శంబర జిల్లాపరిషత్ హైస్కూల్ వద్ద, సాలూరు నుంచి వచ్చే బస్సులకు వనంగుడి సమీపంలో రెండు కాంప్లెక్స్‌లన సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. డిపో మేనేజర్ వెంట ట్రస్టీ బోర్డు చైర్మన్ నైదాన చినతిరుపతి, ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు జె.కిరణ్‌కుమార్, పి.శేఖర్, ఎఎంఎఫ్ రాజు తదితరులు ఉన్నారు.