Share News

Podu Farming పోడు సాగే ఆధారం..కష్టానికి దక్కని ఫలితం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:16 AM

Podu Farming Sustains Livelihoods... But Yields Little Reward ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా.. మన్యంలో ఆది వాసీల జీవనం మాత్రం మారడం లేదు. ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. ప్రధానంగా కొండపోడు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీల శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. ఆ

Podu Farming   పోడు సాగే ఆధారం..కష్టానికి దక్కని ఫలితం
కొండపోడు సాగులో భాగంగా పెద్దగూడలో వరినాట్లు వేస్తున్న దృశ్యం

  • పంటలు, అటవీ ఉత్పత్తులకు లభించని గిట్టుబాటు ధర

  • నిత్యం దళారుల దోపిడీ

  • పూర్తిస్థాయిలో దరి చేరని పథకాలు.. అందని రుణాలు

  • నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

సీతంపేట, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా.. మన్యంలో ఆది వాసీల జీవనం మాత్రం మారడం లేదు. ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. ప్రధానంగా కొండపోడు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీల శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు, అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. మార్కెట్‌ సదుపాయం లేక వారపు సంతల్లోనే తమ పంటలను విక్రయించుకుంటున్నా.. గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారు. నిత్యం దళారుల దోపిడీకి గురవుతున్నారు. మరోవైపు సబ్సిడీ రుణాలు, సాగు పరికరాలు వంటివి వారి దరి చేరడం లేదు. సంక్షేమ పథకాలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. పలు కారణాలతో నేటికీ అనేక కుటుంబాలు చదువుకు దూరంగానే ఉంటున్నాయి. మొత్తంగా గిరిబిడ్డలు కష్టాలతోనే ఎదురీ దుతున్నారు. సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు ఈ ఏడాది 2,300హెక్టార్లలో వరి సాగు చేపడుతున్నారు. మరికొందరు మొక్కజొన్న, నువ్వులు, రాగులు, జీడి, పైనాపిల్‌, అరటి, కొండచీపుర్లు వంటివి పండిస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో గిరిజన రైతులకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో రైతన్నల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

సవర భూగన్న

సీతంపేట మండలం వాబ చింతమానుగూడ గ్రామానికి చెందిన సవర భూగన్న(పీవిటీజీ)అనే గిరిజనుడు గత 50 ఏళ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నాడు. మూడు ఎకరాల్లో వరి, మిగిలిన రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న, నువ్వులు, రాగులు పండిస్తున్నాడు. భూగన్నకు నలుగురు కొడుకులు. వారంతా తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేస్తుంటారు. కొడుకుల్లో ముగ్గురికి వివాహాలయ్యాయి. వారి పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. భూగన్న కుటుం బంలో పెద్దగా చదువుకున్న వారు ఎవరూ లేరు. వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగి స్తున్నారు. వ్యవసాయంలో ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ.2లక్షల వరకు ఆదాయం చేకూరుతోంది. సబ్సిడీ రుణాలు, వ్యవసాయ యంత్రపరికరాలు, పిల్లలకు తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వారు పండించే మొక్కజొన్న, రాగులు, నువ్వులకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాకపోయిన్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో సీతంపేట వారపు సంతల్లోనే విక్రయిం చాల్సి వస్తోంది.

సవర రాజు

లక్కాయిగూడ పీవీటీజీ గ్రామానికి చెందిన సవర రాజు అనే గిరిజనుడు కూడా కొండపోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబం. పల్లం భూమి ఎకరా వరకు ఉండగా కొండపోడు భూమిని రెండెకరాల వరకు సాగుచేస్తున్నాడు. ఆ భూమిలో జీడి, పైనాపిల్‌, అరటి ,మొక్కజొన్న, కొండచీపుర్లు వంటి వాటిని పండిస్తున్నాడు. సవర రాజుకు ముగ్గురు పిల్లలు. వారంతా స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. వ్యవ సాయం, గిరిజన ఉత్పత్తులపై ఏడాదికి రూ.80వేల వరకు ఆదాయం వస్తోంది. అప్పులు ఏవి లేకపోయినప్పటికీ వచ్చిన ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తోంది. అయితే అటవీ ఉత్ప త్తులకు మద్దతు ధర రావడం లేదని రాజు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.

సవర బంపడు

గిరిశిఖర గ్రామం జగతిపల్లికి చెందిన సవర బంపడు(పీవిటీజి)అనే గిరిజనుడు కొండపోడు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. కొండపోడు వ్యవసాయం రెండెకరాలు, పల్లం భూమి ఎకరా వరకు సాగుచేస్తున్నాడు. కొండపోడు భూమిలో కొండచీపుర్లు, చెట్టుపనస, పైనాపిల్‌ వంటి పంటలను పండిస్తున్నాడు. ఈ పంటలను సీతంపేట వారపుసంతల్లో విక్రయిస్తుంటాడు. వ్యవసాయానికి ఏటా రూ.40వేల వరకు ఖర్చులవుతుండగా.. అన్నీ పోను రూ.60వేల వరకు వస్తోంది. ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని కారణంగా దమ్ములు చేపట్టలేదు. ఈఏడాది ఆదాయం తగ్గుతుందని బంపడు వాపోయాడు. ఐటీడీఏ ద్వారా ఇంతవరకు సబ్సిడీ రుణాలు అందలేదని తెలిపాడు. కాగా బంపడు కుమారుడు రాజేష్‌ ప్రస్తుతం రాజేష్‌ ప్రభుత్వ పాఠశాలలో సీఆర్‌టీగా పనిచేస్తున్నాడు.

Updated Date - Aug 09 , 2026 | 12:16 AM