Share News

నకిలీ బంగారం తాకట్టు పెట్టి..

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:25 AM

నకిలీ బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి సొమ్ము కాజేసిన మహిళపై శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

నకిలీ బంగారం తాకట్టు పెట్టి..

  • రూ.2,43,300 కాజేసిన మహిళ

  • మేనేజర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నకిలీ బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి సొమ్ము కాజేసిన మహిళపై శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన మండల భవాని ఈ ఏడాది జూన్‌ 17న పెట్రోమాక్స్‌ వీధిలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారు గాజులు తాకట్టు పెట్టి సుమారు రూ.2,43,300 నగదును రుణంగా పొందింది. అయితే జూలై 22న బ్యాంకు ఉన్నతాధికారులు వచ్చి ఆడిట్‌ చేపట్టి సదరు మహిళ తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని నిర్ధారించారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్‌ ఆమెకు ఫోన్‌ చేసి నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణం పొందారని, వెంటనే నగదు కట్టి విడిపించాలని కోరారు. అయితే ఆమె ఎంతటికీ రాకపోవడంతో ఆనుమానం వచ్చి ఆమె ఇంటికి వెళ్లేసరికి కనిపించకుండా పోవడంతో బ్యాంకు మేనేజర్‌ చౌదరి రవీంద్ర టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ ఎస్‌ఐ హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనుమానాలెన్నో?

మహిళ తాకట్టుపెట్టిన బంగారం నకిలీదని, ఆ రోజే బ్యాంకు సిబ్బంది తెలుసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా బ్యాంకులు ఏవైనా బంగారం తాకట్టు పెట్టే ముందు అప్రయిజర్‌ సాయంతో బంగారం నకిలీదా, కాదా, ఎన్ని గ్రాములు, బరువు అన్నీ పరిశీలించాకే తాకట్టు పెట్టిన వ్యక్తులకు రుణం ఇసా ్తరు. కాని సదరు మహిళ పెట్టిన బంగారంపై ఇటువంటి ప్రమాణాలు పాటించకుండా రుణం అందించడం కూడా బ్యాంకు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Sep 19 , 2026 | 12:25 AM