Share News

Pleasure.. A Long Way Off! ఆహ్లాదం.. బహుదూరం!

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:26 AM

Pleasure.. A Long Way Off! సాలూరు పురపాలక సంఘంలో పార్కులు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణం అందించాల్సిన ప్రదేశాలు కలుపు మొక్కలు, ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి. చెత్తాచెదారాలతో నిండి కంపుకొడుతున్నాయి. విష సర్పాలకు నిలయంగా మారుతున్నాయి.

Pleasure.. A Long Way Off! ఆహ్లాదం.. బహుదూరం!
బంగారమ్మ కాలనీ పార్కు పరిస్థితి ఇదీ..

  • పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో దర్శనమిస్తున్న వైనం

  • విష సర్పాలకు నిలయం.. కానరాని పచ్చదనం

  • అడగు పెట్టాలంటే ముక్కు మూసుకోవాల్సిందే..

  • కొన్నిచోట్ల ఆక్రమణలు.. పట్టించుకోని అధికారులు

సాలూరు, ఆగస్టు30(ఆంధ్రజ్యోతి): సాలూరు పురపాలక సంఘంలో పార్కులు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణం అందించాల్సిన ప్రదేశాలు కలుపు మొక్కలు, ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి. చెత్తాచెదారాలతో నిండి కంపుకొడుతున్నాయి. విష సర్పాలకు నిలయంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల పార్కులు ఆక్రమణలకు గురవుతున్నాయి. పార్కుల్లో పచ్చదనం కానరావడం లేదు. అడుగు పెట్టాలంటే ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితి. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాలూరులో పార్కులు కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ఇదీ పరిస్థితి..

- సుమారు 50 వేల జనాభా ఉన్న సాలూరు పురపాలక సంఘంలో ఎనిమిది వరకు పార్కులు ఉన్నాయి. అయితే వాటిల్లో చాలావరకు వినియోగానికి దూరంగా ఉన్నాయి. 1920లో పెద్ద బజారు సమీపంలో పది సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గాంధీ పార్కును దాతల సాయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక పట్టణ ముఖద్వారం వద్ద గాంధీనగర్‌లో పది సెంట్ల విస్తీర్ణంలో ఉన్న సాలూరు రాజేశ్వరరావు పార్క్‌ అధ్వాన స్థితికి చేరింది. 2003లో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ పార్కులో పచ్చదనం కనుమరుగైంది. రక్షణ గేట్లు పూర్తిగా విరిగాయి. పిల్లలు, పెద్దలు అడుగు పెట్టలేని స్థితికి చేరింది.

- 1995లో శ్రీనివాసనగర్‌లోని 32 సెంట్లలో పార్క్‌ ఏర్పాటు చేయగా.. 2013లో రూ.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. విద్యుత్‌ దీపాలు, ఆటపరికరాలు ఏర్పాటు చేశారు. అయితే అవన్నీ దొంగలపాలయ్యాయి. ప్రస్తుతం పశువుల శాలగా మారింది.

- రామా కాలనీలోని 99 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పార్క్‌ కూడా కళావిహీనంగా మారింది. పార్కు స్థలం ఆక్రమణకు గురవగా.. రక్షణ గోడలు కూలిపోయాయి. కాలనీవాసులు పశువులను ఇక్కడే కడుతుండగా.. మరికొందరు చెత్తాచెదారమంతా పార్క్‌లో వేస్తున్నారు. గతంలో బుడా ద్వారా రూ.50 లక్షలు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అయితే గత వైసీపీ సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ పార్క్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

- ఇక పట్టణంలోని బంగారమ్మ కాలనీలో ఎకరా 82 సెంట్ల స్థలాన్ని పార్కు అభివృద్ధికి కేటాయించారు. గత టీడీపీ పాలనలో రక్షణ గోడ, నడకదారులు నిర్మించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఈ పార్క్‌ నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ప్రస్తుతం ఇది పిచ్చిమొక్కలతో నిండి అధ్వానంగా మారింది. అంతేకాకుండా పరిసరాల్లో చెత్త పేరుకుపోయి డంపింగ్‌యార్డులా కనిపిస్తోంది. పట్టణానికి ఆనుకుని గుమడాం పార్కు పరిస్థితి కూడి ఇలానే ఉంది. పట్టణంలో పార్క్‌లను మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపాల్టీ వాసులు కోరుతున్నారు.

అభివృద్ధికి ప్రతిపాదనలు

పట్టణంలోని పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించాం. రామాకాలనీ పార్కుకి బుడా నుంచి రూ.50లక్షలు మంజూరయ్యాయి. అయితే ఇంకా నిధులు రాలేదు. మంత్రి ఆదేశాల మేరకు గాంధీపార్కును అభివృద్ధి చేస్తున్నాం. పట్టణంలో మిగిలిన పార్కులపై దృష్టి సారిస్తాం.

- రత్నకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, సాలూరు

Updated Date - Aug 31 , 2026 | 12:26 AM