please solve those problems ఆ కష్టాలను మీరైనా తీర్చాలి
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:02 AM
please solve those problems వేసవి వస్తోందంటే విజయనగరం వాసులకు ముందే హడలు.. తాగునీరు అందుతుందో, లేదోనని టెన్షన్ పడుతుంటారు. వర్షాకాలం వస్తే రోడ్డుపైకి వెళ్లాలంటే అమ్మో అంటుంటారు. మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తే పని వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే ఎటు చూసినా మురుగునీరే కనిపిస్తుంటుంది. వాన పడినప్పుడల్లా అక్కడ ఇదే దుస్థితి.
ఆ కష్టాలను
మీరైనా తీర్చాలి
వేసవి వస్తే దాహం కేకలు
వర్షం కురిస్తే మురుగు తిప్పలు
మొక్కుబడిగా ఇంటింటి చెత్త సేకరణ
అధ్వానంగా రహదారులు
ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు
కార్పొరేషన్లో చక్రం తిప్పుతున్న కొందరు
తక్షణం దృష్టిపెట్టాలని ప్రజల విన్నపాలు
కొత్త మేయర్‌పై ఎన్నో ఆశలు
రేపు కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం
వేసవి వస్తోందంటే విజయనగరం వాసులకు ముందే హడలు.. తాగునీరు అందుతుందో, లేదోనని టెన్షన్ పడుతుంటారు. వర్షాకాలం వస్తే రోడ్డుపైకి వెళ్లాలంటే అమ్మో అంటుంటారు. మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తే పని వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే ఎటు చూసినా మురుగునీరే కనిపిస్తుంటుంది. వాన పడినప్పుడల్లా అక్కడ ఇదే దుస్థితి. ప్రధాన కాలువల చెంత అక్రమ నిర్మాణాలే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. రహదారులు కూడా చాలా చోట్ల అధ్వానంగా ఉన్నాయి. కొత్త మేయర్‌పై మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కీలకంగా మారింది. ప్రజలు కూడా తొలుత కనీస సౌకర్యాలు కల్పించాలంటున్నారు. కార్పొరేషన్ పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది.
విజయనగరం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి):
విజయనగరం నగరపాలక సంస్థకు కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టే కార్యక్రమం దగ్గర పడుతున్నది. పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి నగరపాలక సంస్థ కమిషనర్ బాలాస్వామితో పాటు మిగతా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. మేయర్, డిప్యూటీ మేయర్లకు సంబంధించిన చాంబర్లు, సిబ్బంది కేటాయింపు, ఆయా చాంబర్లలో మౌలిక వసతులు ఇలా అన్నింటిపైనా యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. ఈ నెల 23న కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించనుంది. ఇదిలా ఉంటే విజయనగరం నగరపాలక సంస్థను దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వాటి పరిష్కారానికి నూతన పాలకవర్గం కృషి చేయాల్సి ఉంది. ఆదాయం పెంచడంతో పాటు వ్యయం తగ్గించడం, మౌలిక సదుపాయాలు కల్పించడంపై పాలకవర్గం ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. గత వైసీపీ పాలకుల నిర్వాకం వల్ల నగరపాలక సంస్థకు ఆదాయం భారీగా తగ్గింది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
- విజయనగరం జనాభా 3 లక్షలు దాటింది. అందుకు తగ్గట్టు మంచినీటి సరఫరా లేదు. నగర ప్రజలకు ప్రతి రోజు 30 ఎంఎల్డీ ( మిల్లీలీటర్ పర్ డే) అవసరం. అయితే నెల్లిమర్ల, రామతీర్థం, ముషిడిపల్లి వాటర్ వర్క్స్ నుంచి ప్రతి రోజు 18 ఎంఎల్డీ నుంచి 20 ఎంఎల్డీ వరకూ మాత్రమే వస్తున్నది. మిగతాది కొరతే. తారకరామతీర్థసాగర్ పూర్తి చేయగలిగితే నగరానికి తాగునీటి సమస్య ఉండదు. ఆ వైపుగా కార్పొరేషన్ పాలకవర్గంతోపాటు ఎమ్మెల్యే మరింతగా కృషి చేయాలని నగర వాసులు కోరుతున్నారు. కొత్తపేట వాటర్ ట్యాంకు పురాతనమైనది. దీనిని ఆధునికీకరించి సిబ్బందిని కేటాయించాల్సి ఉంది.
- నగరాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య పారిశుధ్యం. నగర విస్తీర్ణం, జనాభాకి అనుగుణంగా సిబ్బంది లేరు. వాహనాల పరిస్థితి అంతే.. ఇంటింటి చెత్త సేకరణ చాలా ప్రాంతాల్లో ముందుకు సాగని పరిస్థితి. 62 డివిజన్లకు సంబంధించిన వాహనాలు పూర్తిస్థాయిలో లేవు.
- మేయర్‌గా ఎన్నికైన అవనాపు భార్గవి ఇటీవల ఒక కార్యక్రమంలో నగరపాలక సంస్థలో అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పారు. ఇది ఆచరణలో ఎంత వరకూ సాధ్యమనేది వేచిచూడాల్సిందే. నగరపాలక సంస్థలో కొంతమంది సిబ్బంది అవినీతికి బార్లా తలుపులు తీసే వుంచుతారన్న ఆరోపణ ఉంది. వీరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఒక మాజీ వైసీపీ కార్పొరేటర్ తమ పనులు చేసుకుంటారని వినికిడి. సిబ్బంది అంతా ఆయన కనుసన్నల్లోనే ఉంటారట.
- నగరపాలక సంస్థలో చక్రం తిప్పుతున్న సిబ్బందిని వేర్వేరు కార్పొరేషన్లకు బదిలీ చేస్తేనే కొత్త పాలకవర్గం పాలన త్వరగా గాడిన పడుతుందున్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలతో అవస్థలు
నగరంలో 62 డివిజన్లు ఉన్నాయి. 51.62 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 90 వేలు ఇళ్లు ఉండగా 3.20 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అయితే చిన్నపాటి వర్షానికే నగరం మునిగిపోతోంది. నిత్యం మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. అక్రమ నిర్మాణాలే దీనికి కారణం. కళ్లెదుటే అక్రమ కట్టడాలు కనిపిస్తున్నా నిలువరించే ప్రయత్నం ఇన్నాళ్లూ జరగలేదు. గంటస్తంభం, వినాయక్‌నగర్, భగవాన్ నగర్, నటరాజ్ కాలనీ, పద్మావతి నగర్, కార్పొరేషన్ కార్యాలయం, ప్రకాశం పార్కు, సిటీ స్టాండ్, ధర్మపురి తదితర ప్రాంతాల్లో ప్రధాన కాలువల చెంత అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో కొంచెం వర్షం కురిస్తే చాలు నగరం నదిలా మారిపోతోంది.
సమన్వయంతో సాగితే..
విజయనగరంలో అవినీతి మచ్చలేని నాయకునిగా పూసపాటి అశోక్‌గజపతిరాజు ఉన్నారు. ఆయన తనయ అతిది విజయలక్ష్మి తండ్రి బాటలో పయనిస్తున్నారు. కొత్త పాలకవర్గంలో కూడా అనుభవం, పేరున్న నాయకులు చేరారు. వీరందరితో సమన్వయం చేసుకుంటూ విజయనగరంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటివి దరిచేరకుండా మేయర్ భార్గవి పరిపాలించాలని స్థానికులు కోరుకుంటున్నారు.