Share News

please respond us మా మొర ‘ఇనాం’డయ్యా..!

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:46 PM

please respond us జిల్లాలో ఇనాం భూముల సమస్యకు పరిష్కారం కోసం వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. భూ హక్కులు పూర్తిగా పొందక, అటు ఇనాందారులెవరో, ఎక్కడున్నారో తేలక లబోదిబోమంటున్న రైతులకు దశాబ్దాలు గడుస్తున్నా న్యాయం జరగడం లేదు. చీపురుపల్లిలోని జి.అగ్రహారం రైతుల ఇనాం భూముల సమస్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంది.

please respond us మా మొర ‘ఇనాం’డయ్యా..!
జి.అగ్రహారంలో రైతుల సాగులో ఉన్న ఇనాం భూములు

మా మొర ‘ఇనాం’డయ్యా..!

సాగులో ఉన్నా రైతులకు దక్కని భూ హక్కులు

1200 ఎకరాలకు మారని రికార్డులు

400 మంది రైతులకు ఆ భూములే ఆధారం

న్యాయం కోసం జి.అగ్రహారం ఇనాం భూముల రైతుల ఎదురుచూపు

జిల్లాలో ఇనాం భూముల సమస్యకు పరిష్కారం కోసం వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. భూ హక్కులు పూర్తిగా పొందక, అటు ఇనాందారులెవరో, ఎక్కడున్నారో తేలక లబోదిబోమంటున్న రైతులకు దశాబ్దాలు గడుస్తున్నా న్యాయం జరగడం లేదు. చీపురుపల్లిలోని జి.అగ్రహారం రైతుల ఇనాం భూముల సమస్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంది. ఈ గ్రామంలో సుమారు 1200 ఎకరాల భూములు రైతుల సాగులో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో హక్కు పత్రాలు లభించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. పని జరగడం లేదు.

చీపురుపల్లి, మార్చి 26(ఆంధ్రజ్యోతి):

చీపురుపల్లి మేజరు పంచాయతీ పరిధిలోని గులివిందాడ అగ్రహారం ఒక రెవెన్యూ గ్రామం. ఈ గ్రామ పరిధిలో సుమారు 1300 ఎకరాల భూములున్నాయి. రికార్డుల ప్రకారం ఇవి ఇనాం భూములుగా నమోదై ఉన్నాయి. తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించిన గజపతినగరం బ్రాంచి కెనాల్‌కు దాదాపు 100 ఎకరాలు పోగా సుమారు 1200 ఎకరాలు రైతుల సాగులో మిగిలి ఉన్నాయి. ఈ భూములను 400 మంది రైతులు సాగు చేస్తున్నారు. దశాబ్దాల తరబడి సాగు చేస్తున్నప్పటికీ రికార్డుల ప్రకారం ఇవి ఇనాం భూములు కావడంతో రైతులకు ఎటువంటి హక్కు పత్రాలు ఇవ్వలేదు. దీనివల్ల రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆడ పిల్లల వివాహాల కోసం భూములు విక్రయించాలన్నా, బ్యాంకుల్లో కుదువ పెట్టాలన్నా సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడడం లేదు. రైతుల పేరున 1బీలు కూడా లేకపోవడంతో ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సహాయం కూడా సక్రమంగా అందడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప బీమా సౌకర్యం, ఆర్థిక సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు.

ఇనాందారుల జాడ లేదు

రికార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ అసలు ఇనాందారులెవరో, ఎక్కడుంటారో ఎవరికీ తెలియడం లేదు. ఈ కారణంగా రైతులకు రికార్డులు దఖలు పడడం లేదు. రైతులంతా కలిసి పలు మార్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు మొర పెట్టుకుంటున్నా.. ఇనాందారులు ఎవరో తేలితే తప్ప సమస్య పరిష్కరం కాదని స్పష్టం చేస్తుండడంతో సమస్య యథాతథంగా ఉండిపోయింది. ఇనాందారులు ముందుకు రావడం లేదన్న కారణంతో తమ సమస్యను దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

ఏళ్ల తరబడి సమస్య ఉన్న మాట వాస్తవం. అగ్రహారం భూముల్లో గుర్తించబడిన ఇనాం దారులు లేరని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించాం. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల వివరాలు కూడా నమోదు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

డి.ధర్మరాజు, తహసీల్దారు, చీపురుపల్లి

Updated Date - Mar 26 , 2026 | 11:46 PM