Share News

Please don't sell! ప్లీజ్‌.. అమ్మకండి!

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:40 PM

Please don't sell! జిల్లాలో రేషన్‌ బియ్యం అమ్మకాలకు చెక్‌ పడడం లేదు. ప్రభుత్వం ఒకటి తలస్తే లబ్ధిదారులు మరోలా చేస్తున్నారు. మరోవైపు రేషన్‌బియ్యాన్ని తరలిస్తూ దళారులు ఎప్పటికప్పుడే పట్టుబడుతున్నారు. అధికారులు బియ్యం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఫైన్‌ విధిస్తున్నారు.

 Please don't sell! ప్లీజ్‌.. అమ్మకండి!

ప్లీజ్‌.. అమ్మకండి!

జిల్లాలో తగ్గని రేషన్‌ బియ్యం విక్రయాలు

ఎప్పటికప్పుడే పట్టుకుంటున్న అధికారులు

డీలర్లూ వ్యాపారి అవతారం

దళారులకు లెక్కే లేదు

పోషకాల బియ్యాన్ని కోల్పోతున్న పేదలు

జిల్లాలో రేషన్‌ బియ్యం అమ్మకాలకు చెక్‌ పడడం లేదు. ప్రభుత్వం ఒకటి తలస్తే లబ్ధిదారులు మరోలా చేస్తున్నారు. మరోవైపు రేషన్‌బియ్యాన్ని తరలిస్తూ దళారులు ఎప్పటికప్పుడే పట్టుబడుతున్నారు. అధికారులు బియ్యం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఫైన్‌ విధిస్తున్నారు. అయినా సరే రేషన్‌ బియ్యం అమ్మకాలు, కొనుగోళ్లు ఆగడం లేదు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కార్డుదారులు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. పోషక విలువలకు దూరమవుతున్నారు.

- గతనెల 5న వేపాడ మండలం జగ్గయ్యపేట సమీపంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1200 కిలోల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు.

- ఈనెల 3న బొబ్బిలి మండలం పారాదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 445 కిలోల చౌక బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తెల్ల రేషన్‌కార్డున్న ప్రతిఒక్కరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యంలో సుమారు 70 శాతం మంది కార్డుదారులు వాటిని దళారులకు అమ్మేస్తున్నారు. ఒక్కొక్కరికీ 5 కిలోల వంతున డీలర్ల నుంచి తెచ్చిన బియ్యం క్షణాల్లో కిలో రూ.15 నుంచి రూ.18 మధ్య విక్రయిస్తున్నారు. మరికొంతమంది కార్డుదారులు సంబంధిత డీలర్‌తో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రేషన్‌డిపో వద్ద థంబ్‌ వేసి బియ్యాన్ని అక్కడే ఉంచేస్తున్నారు. డీలర్‌ నుంచి నగదు తీసుకునే కార్డుదారులు కూడా వేలల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు భరిస్తూ పేద, బడుగు, బలహీనవర్గాల వారికి పోషక విలువలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేస్తున్న విషయాన్ని కార్డుదారులు విస్మరిస్తున్నారు. ఉచితంగా ఇస్తోందన్న చులకనభావంతో దళారులకు అప్పగించి పౌష్టికాహారానికి దూరమవుతు న్నారు.

ఎంతో వ్యయం చేస్తున్న ప్రభుత్వాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్ధతు ధర చెల్లిస్తూ లక్షలాది క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిస్తున్నాయి. ఈ ప్రక్రియంలో ప్రభుత్వ యంత్రాంగం ఎన్నో వ్యయ, ప్రయాసలకు లోనవుతూ రైతులకు బిల్లులు చెల్లిస్తూ, సేకరించిన ధాన్యాన్ని రైతులు నచ్చిన రైస్‌మిల్లులకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇలా వచ్చిన ధాన్యాన్ని మెరుగుపరిచి తేమశాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని బియ్యంగా మారుస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కొంతమేర నష్టాన్ని భరిస్తున్నాయి. ఆపై పేదలకు పంపిణీ చేస్తున్నాయి. కార్డుదారుడి ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికీ 5 కిలోల వంతున ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగస్వాములుగా మారిన డీలర్లకు కమీషన్‌ సైతం చెల్లిస్తూ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అయితే ఇవేమీ పట్టని జనం బియ్యాన్ని చౌకగా అమ్మేస్తున్నారు.

పోషక విలువలివిగో...

ఇతర రకాల బియ్యంలాగే రేషన్‌ బియ్యంలో కూడా శరీరానికి శక్తినందించే కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనడానికి ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 వంటి సూక్ష్మ పోషకాలు కూడా నిండి ఉంటాయి. పూర్తిగా పాలిష్‌ చేయని బియ్యంలో సాధారణ తెల్లబియ్యం కన్నా ఎక్కువ ఫైబర్‌, ప్రొటీన్లు కలిగి ఉంటాయి. పోర్టిఫికేషన్‌, ఐరన్‌, ఫోలిక్‌ ఆమ్ల లోపాలు పరిష్కరించడానికి రేషన్‌బియ్యంలో ఉన్న పోషకాలు కూడా సహాయపడతాయి.

అమ్మకంతో నష్టాలిలా...

నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి ప్రభుత్వం 20 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తోంది. వీటిని కిలో రూ.16 వంతున కేవలం రూ.320కే అమ్మేస్తున్నారు. అయితే పోషకవిలువలున్న బియ్యాన్ని అమ్మేయడం వల్ల కలిగే నష్టాలను మాత్రం తెల్ల రేషన్‌కార్డుదారులు ఆలోచించడం లేదు. కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని వ్యాపారులు, దళారులు వాటిని సమీపంలోని మిల్లుల్లో పాలిష్‌ పట్టిస్తున్నారు. పాలిష్‌ అనంతరం పోషకవిలువల్లేని బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి 25 కిలోలు రూ.1600 నుంచి రూ.1800 వరకు తిరిగి ప్రజలకే అంటగడుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోట్లాది రూపాయులు వెచ్చించి ప్రభుత్వాలు బియ్యాన్ని తయారుచేసి ప్రజలకు అందిస్తుంటే ప్రజలు మాత్రం రేషన్‌బియ్యం అంటే చులకన భావంతో వచ్చిన ధరకు అమ్మేస్తూ ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. .

ఆ బియ్యంలో ఎన్నో పోషకాలు

డా.గార రవిప్రసాద్‌, ఎండీ, జనరల్‌ మెడిసిన్‌, రాజాం

పేద, మధ్యతరగతి వారికి ఉచితంగా సరఫరా చేసే రేషన్‌ బియ్యంలో పోర్టిఫైడ్‌ బియ్యాన్ని కలుపుతున్నారు. తద్వారా వారి ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వాలు భావిస్తుండగా ఇవేమీ పట్టని ప్రజలు వాటికి దూరమవుతున్నారు. వాస్తవానికి ఈ బియ్యం అన్నంగానే కాకుండా పిండిగా మార్చుకుని ఇడ్లీ, దోసలు, ఉప్మాలలో కలిపుకుని తింటే శరీరానికి మంచి పోషకవిలువలు అందుతాయి. జీర్ణశక్తి పెరిగి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

జిల్లాలో...

మొత్తం రేషన్‌ డిపోలు: 1249

రేషన్‌కార్డులు: 5,80,237

మొత్తం యూనిట్లు: 16,62,324

ఏఏవై కార్డులు: 35,793

యూనిట్లు: 90,901

Updated Date - Feb 10 , 2026 | 11:40 PM