Plastic in Cattle పశువుల్లో ప్లా‘స్టాక్’
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:33 AM
Plastic in Cattle వంగరకు చెందిన రైతు సూర్యారావుకు చెందిన పాడి ఆవు పూర్తిగా నీరసించిపోవడంతో ఆ మధ్య ఆయన పశువైద్యులను ఆశ్రయించాడు. గత నెల 7 తేదీన వైద్యులు ఆవుకు శస్త్ర చికిత్స చేయగా కడుపులో 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతి కష్టమ్మీద ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ప్రస్తుతం ఆవు కోలుకుంటోంది.
పశువుల్లో ప్లా‘స్టాక్’
బలవుతున్న మూగజీవాలు
నగరాలు, పట్టణాల్లో మేతగా తింటున్న వైనం
వ్యర్థాలు పెరిగాక ప్రాణాపాయం
- వంగరకు చెందిన రైతు సూర్యారావుకు చెందిన పాడి ఆవు పూర్తిగా నీరసించిపోవడంతో ఆ మధ్య ఆయన పశువైద్యులను ఆశ్రయించాడు. గత నెల 7 తేదీన వైద్యులు ఆవుకు శస్త్ర చికిత్స చేయగా కడుపులో 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతి కష్టమ్మీద ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ప్రస్తుతం ఆవు కోలుకుంటోంది.
- రాజాం పట్టణానికి చెందిన రైతు రవికుమార్ పశువులను పెంచుతుంటాడు. ఇటీవల ఓ ఆవు ఈతకు వచ్చింది. తొందరగా బరువు పెరిగిపోవడంతో పాటు ప్రసవ వేదనతో చనిపోయింది. పరిశీలించిన పశువైద్యులు కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని చెప్పారు.
రాజాం, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి):
నగరాలు, పట్టణాల్లో మూగజీవాలకు ప్లాస్టిక్ హానికరంగా మారుతోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులను రైతులే మేతకు తీసుకువెళతారు. నగరాలు, పట్టణాల్లో ఆ అవకాశం తక్కువ. పగలంతా రోడ్లపై తిరిగే ఆవులు సాయంత్రానికి ఇంటికి చేరతాయి. వాటిని పాలిచ్చే యంత్రాలుగా చూస్తున్నారే తప్ప.. సంరక్షణను సరిగా చూడడం లేదు. నగరం, పట్టణ ప్రాంతాల్లో ఏ ఆవు పొట్ట చూసినా అది భారీగా కనిపిస్తే అనుమానించాల్సిందే. వాటి లోపల ప్లాస్టిక్ వ్యర్థాలుండే ప్రమాదముందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. జీర్ణశక్తి బాగా ఉన్నంత వరకూ ఎలాగోలా మూగజీవి బతికేస్తుందని, బలహీనమయ్యాక ఆ వ్యర్థాలు కడుపులోనే ఉండిపోయి చివరకు ప్రాణం తీస్తాయంటున్నారు.
జిల్లాలో విజయనగరం కార్పొరేషన్, రాజాం, బొబ్బిలి మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలతో పాటు 12కుపైగా మేజర్ పంచాయతీలు పట్టణాలుగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్నిచోట్లా పశువుల విహారం ఉంది. సుమారు 5 వేల వరకూ పశువులు పట్టణాల్లో సంచరిస్తున్నట్టు మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. తరచూ పెంపకందారులతో సమావేశాలు నిర్వహించడం, పశువులను ఇష్టారాజ్యంగా విడిచిపెట్టవద్దని ఆదేశించడం పరిపాటిగా మారింది. అయినా సరే వారు పశువులను విడిచిపెడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లలో మిగిలిపోయిన ఆహారం తినే క్రమంలో అవి ఆవు కడుపులో చేరుతున్నాయి. సంచుల వాసనతో ఆహారంగా భావించి తిన్న మూగజీవాలు కూడా ఉన్నాయి. చివరకు ఆవు దూడలు సైతం ప్లాస్టిక్‌ను తింటుండడం ఆందోళన కలిగిస్తోంది.
మూగజీవుల ప్రాణాలకు హాని
సాధారణంగా ఆవు కడుపులో ప్లాస్టిక్ అనేది జీర్ణం కాదు. ప్లాస్టిక్ వ్యర్థాలు తినే ఆవులు ఎక్కువగా మరణిస్తున్నాయి. దవడల ప్రత్యేక నిర్మాణంతో చాలా ఆవులు ఏం తింటున్నదీ తెలుసుకోలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆవులు ఆహారాన్ని నములుతాయి. కానీ వాటి దవడలు వ్యర్థాలను గుర్తించేటంత సున్నితంగా ఉండవంటున్నారు. జీర్ణం కాని ఆహారం వాంతులు చేసుకునే తత్వం ఆవులకు ఉండదు. అలా కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ఇతర ఆహారాన్ని తినడానికి వీలు లేకుండా చేస్తాయి. అయితే ఈ వ్యర్థాలతో పాటు ఇనుప ముక్కలు కూడా ఒక్కోసారి ఆవు కడుపులో చేరుతున్నాయని పశువైద్యులు తెలిపారు. నగరాలు, పట్టణాల్లో ఆవులను విచ్చలవిడిగా విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదని, అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.