Plan for grain procurement ధాన్యం సేకరణకు ప్రణాళిక
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:34 PM
Plan for grain procurement జిల్లాలో ధాన్యం సేకరణకు యంత్రాంగం ప్రణాళిక రూపొందించుకుంది. 2026-27 ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలో స్థాయిలో శిక్షణ నిర్వహించారు. ఈ నెల 11 నుంచి మండల స్థాయిలో శిక్షణ నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టారు.
ధాన్యం సేకరణకు ప్రణాళిక
జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యం
సాధారణ రకం క్వింటా రూ.2,441 , గ్రేడ్ ఏ రకం రూ.2,461
మిల్లర్లు నుంచి రూ.738 కోట్లు బ్యాంకు గ్యారెంటీల స్వీకరణకు నిర్ణయం
నేటి నుంచి మండల స్థాయిలో శిక్షణ
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం సేకరణకు యంత్రాంగం ప్రణాళిక రూపొందించుకుంది. 2026-27 ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలో స్థాయిలో శిక్షణ నిర్వహించారు. ఈ నెల 11 నుంచి మండల స్థాయిలో శిక్షణ నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టారు.
జిల్లాలో ఈ ఏడాది 6,04,114 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇందులో రైతుల నుంచి 4 లక్షలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలోనే రైతుల నుంచి కొనుగోలు ప్రారంభించాలని అధికార యంత్రాంగం ప్రణాళిక తయారు చేసింది. నవంబరులో 15,000 మెట్రిక్ టన్నులు, డిసెంబరులో 1,77,000 మెట్రిక్ టన్నులు, జనవరిలో 1,68,000 మెట్రిక్ టన్నులు, ఫిబ్రవరిలో 32,000 మెట్రిక్ టన్నులు సేకరించనున్నట్లు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల నుంచి క్వింటా సాధారణ రకం రూ.2,441, గ్రేడ్- ఏ రకం క్వింటాకు రూ.2,461 చొప్పున కొనుగోలు చేయనున్నారు.
ఫ జిల్లాలోని 284 క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. కొనుగోలు చేయనున్న ధాన్యం కోసం 50 లక్షల గన్నీలు అవసరం పడనున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. సేకరించిన ధాన్యాన్ని 170 మిల్లులకు అందజేయనున్నారు. మిల్లర్లు 1ః1 ప్రకారం సుమారు రూ.738 కోట్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించడానికి 4000 వాహనాలు అవసరం కానున్నాయి. ఇప్పటి వరకూ 1200 వాహనాలు రిజిస్ర్టేషన్ చేశారు. 0నుంచి 8 కిలోమీటర్ల వరకూ రూ.295 చొప్పున చార్జీలు అందజేస్తారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
సివిల్ సప్లయ్ డీఎం శాంతి
రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలని సివిల్ సప్లయ్ డిఎం బి.శాంతి తెలిపారు. ధాన్యం సేకరణపై జిల్లా స్థాయిలో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం సేకరణకు అవసరమైన సదుపాయాలు తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు సిద్ధంగా ఉంచాలని, మిల్లర్లు బీజీ(బ్యాంకు గ్యారెంటీ)లు ఇవ్వాలని సూచించారు. క్షేత్ర స్దాయి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ రామారావు, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, జిల్లా ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, మార్క్ఫెడ్ డీఎం వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.