చెరువుల అభివృద్ధికి ప్రణాళిక: ఎమ్మెల్యే అదితి
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:13 AM
చెరువుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అధికారులను ఆదేశించారు.
విజయనగరం రూరల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): చెరువుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా విజయనగరం మండలంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల విషయమై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, తక్షణమే మండల పరిధిలోని 160 చెరువులను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీబీ-రాంజీ పఽథకం కింద చేపడుతున్న పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న పాఠశాలల్లోని సమస్యలు, బడి పిలుస్తోంది కార్యక్రమం తదితర వాటిపై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గురువారం డీఈఓ మాణిక్యం నాయుడుతో సమీక్షించారు. సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని కోరారు.
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు ఓ వరం
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పేదల పాలిట వరంగా మారుతోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. గురువారం నగరంలోని 48వ డివిజన్‌కు చెందిన బొంతు దేవికకు రూ. 84,468 , 19వ డివిజన్‌కు చెందిన కడిమిశెట్టి శశికి రూ.40,918 విలువగల చెక్కులను ఆమె క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ఆరోగ్య శ్రీ, బీమా వర్తించని వారికి సీఎం రిలీఫ్‌ఫండ్‌తో ఊరట లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
జలధార పనులను వేగవంతం చేయండి
బొండపల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): గజపతినగరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జలధార-జలహారతి పథకం కింద చెరువులు, ఫీడర్ ఛానళ్లు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రత్యేకాధికారి వీటీ రామారావు సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశం మందిరంలో గురువారం గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ, జామి మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఇరిగేషన్ ఏఈఈలు, ఏపీవోలు, సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జూలై 9 లోగా గుర్తించిన పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. జూలై 10వ తేదీ నాటికి పనులు చేసిన వివరాలు ఆన్‌లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, ఇరిగేషన్ డీఈఈ ఆర్.రామినాయుడు, ఆండ్ర, తాడిపూడి రాజర్వాయర్ల చైర్మన్లు సతీష్, జగన్నాథం, తహసీల్దార్ డోలా రాజేశ్వరరావు, ఎంపీడీవో రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
చెరువుల పరిరక్షణే లక్ష్యం
భోగాపురం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): చెరువుల పరిరక్షణే లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాధవి అన్నారు. జలధార-జలహారతి కార్యక్రమానికి సంబంధించి ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇరిగేషన్‌శాఖ అధికారులతో గురువారం జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, పూడికతీత పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, తదితర వాటిపై చర్చించారు.