అబ్బా.. ఇదేం వేడి!
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:41 PM
ఎల్‌నినో కారణంగా వాతావరణంలో చోటుచేసుక్ను మార్పులతో జిల్లావాసులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా వేడి, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉండలేక.. బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉక్కపోతకు జనం బెంబేలు
వేసవిని తలపిస్తున్న వాతావరణం
ఎల్‌నినో ప్రభావంతో ముఖం చాటేసిన వరుణుడు
పెరుగుతున్న విద్యుత్ వినియోగం..
గత నెలలో 37.03 మిలియన్ యూనిట్ల వాడకం
పార్వతీపురం, జూలై19(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా వాతావరణంలో చోటుచేసుక్ను మార్పులతో జిల్లావాసులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా వేడి, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉండలేక.. బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి సరేసరి. జిల్లాలో సగటున 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేడి చూస్తే 45డిగ్రీల ఉష్ణోగ్రతలా ఉంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో అనుకున్న సమయానికి వర్షాలు కురవడం లేదు. దీంతో జిల్లావాసుల్లో అత్యధికులు ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ఫ్యాన్లతో పాటు ఏసీలు, కూలర్లను అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాది మే నెలలో పాలకొండ డివిజన్‌లో జిల్లావాసులు 11.724 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే.. ఈ ఏడాదిలో 13.042 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగించారు. అదేవిధంగా పార్వతీపురం డివిజన్‌లో గత ఏడాది మే నెలలో విద్యుత్ వినియోగం 23.383 మిలియన్ యూనిట్లుగా ఉంటే ఈ ఏడాదిలో 28.049 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఒక్క మే నెలలోనే 35.107 మిలియన్ యూనిట్లు విద్యుత్ విని యోగం జరగగా ఈ ఏడాదిలో 41.091 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించినట్లు అధి కారుల రికార్డులు చెబుతున్నాయి. అయితే జూన్ నెలలోనూ అదే స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. పార్వతీపురం డివిజన్‌లో గత ఏడాది జూన్‌లో 21.362 మిలియన్ యూనిట్లు, పాలకొండ డివిజన్‌లో 11.252 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఏడాది జూన్ నెలలో పార్వతీపురం డివిజన్‌లో 24.79 మిలియన్ యూనిట్లు, పాలకొండ డివిజన్‌లో 12.24 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. మొత్తంగా జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే సుమారు ఐదు మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం పెరిగింది. దీనిపై జిల్లా విద్యుత్‌శాఖ ఇంజనీరింగ్ అధికారి త్రినాథరావును వివరణ కోరగా.. ‘ఈ ఏడాది జూన్ నెలలో కూడా విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే సుమారు నాలుగు మిలియన్ యూనిట్లు వాడకం పెరిగింది. ’ అని తెలిపారు.
వేసవి కంటే అధికంగా..
వేసవి కాలం కంటే ఎక్కువగా ఉక్కపోత ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మా లాంటి సిబ్బంది కంటిన్యూగా మూడు గంటల ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్ల కింద కూడా పనులు చేయలేకపోతున్నాం.
- శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉద్యోగి...
గతంలో ఎప్పుడూ చూడలేదు
వర్షాకాలంలో ఇంత ఉక్కపోతనూ గతంలో ఎప్పుడూ చూడలేదు. వేసవికాలాన్ని తలపించేలా ఉన్న వేడితో ఇంటిలో కూడా ఉండలేకపోతున్నాం.
- కె.అప్పలనాయుడు, పార్వతీపురం...