Share News

Petrol Price Hike పెట్రోల్‌ ధర పెంపు

ABN , Publish Date - May 15 , 2026 | 11:49 PM

Petrol Price Hike కేంద్ర సర్కారు.. సామాన్య, మధ్య తరగతి వర్గాలపై పెను భారం మోపింది. అనుకున్నట్టే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచింది. పశ్చిమాసియాలో కొన సాగుతున్న సంక్షోభం నేపథ్యంలో లీటర్‌కు రూ.3చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో జిల్లావాసులు గగ్గోలు పెడు తున్నారు

Petrol Price Hike పెట్రోల్‌ ధర పెంపు
జిల్లా కేంద్రంలో ఓ బంక్‌ వద్ద పెట్రోలో వేయించుకుంటున్న వాహనదారులు

  • వినియోగదారులపై అదనపు భారం

  • అన్ని రంగాలపైనా ప్రభావం

  • ఆందోళనలో మన్యం వాసులు

పార్వతీపురం, మే15(ఆంధ్రజ్యోతి): కేంద్ర సర్కారు.. సామాన్య, మధ్య తరగతి వర్గాలపై పెను భారం మోపింది. అనుకున్నట్టే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచింది. పశ్చిమాసియాలో కొన సాగుతున్న సంక్షోభం నేపథ్యంలో లీటర్‌కు రూ.3చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో జిల్లావాసులు గగ్గోలు పెడు తున్నారు. ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు బాగా పెరిగాయి. తాజాగా పెట్రో ధరలు కూడా పెర గడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రధా నంగా నిత్యావసర సరుకుల ధరలు, రవాణా చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని మన్యం వాసులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- 2022, ఏప్రిల్‌ నుంచి డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపు జోలికి కేంద్రం పోలేదు. 2024 మార్చిలో లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించారు. తాజా ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో ఇంధన ధరలు పెంచారు. కాగా నిన్నమొన్నటివరకు జిల్లాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.110 ఉండేది. ప్రస్తుతం లీటర్‌పై రూ.3 చొప్పున పెంచడంతో పెట్రోల్‌ ధర రూ.113.29కు చేరింది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 నుంచి రూ.103కు చేరింది. ఈ ధరల పెంపు నేపథ్యంలో జిల్లా వినియోగదారులపై సుమారు రూ. కోటి 20 లక్షల పైబడి అదనపు భారం పడే అవకాశం ఉంది. మన్యంలో రోజుకు సుమారు 80 వేల లీటర్ల డీజిల్‌ , 50 వేల లీటర్ల పెట్రోల్‌ వినియోగమవుతోంది. మొత్తంగా 47 పెట్రోల్‌ బంక్‌ల ద్వారా ఈ విక్రయాలు జరుగుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌, ఐవోఎల్‌ తదితర సంస్థలతో పాటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా బంక్‌లను నిర్వహిస్తున్నాయి. అదే విధంగా ఐటీడీఏ, జీసీస, పోలీస్‌ వెల్ఫేర్‌ తదితర ప్రభుత్వ శాఖలు కూడా పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తున్నాయి.

-డీజిల్‌ ధర పెరగడం వల్ల రవాణా చార్జీలతో పాటు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే చివరకు ప్రజలపైనే ఆ భారం పడనుంది. బంగాళాదుంపలు, ఉల్లిపా యలతో పాటు కందిపప్పు, పెసరపప్పు, నూనె తదితర నిత్యావసర సరుకులను ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రవాణా చార్జీలు పెరగ్గా.. మరోవైపు ప్రైవేట్‌ వాహనదారులు కూడా చార్జీలను పెంచనున్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురం నుంచి బొబ్బిలికి రూ.50, కొమరాడ తదితర ప్రాంతాలకు దూరాన్ని బట్టి కనీసం రూ.30 చొప్పున ప్రైవేట్‌ వాహనదారులు ప్రయాణికులన ఉంచి వసూలు చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రతి వ్యక్తి నుంచి రూ.10 అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.

- ఇప్పటికే వాణిజ్య సిలిండర్లపై ధర పెంచిన సంగతి తెలిసిందే. దీనివల్ల హోటల్‌, పాస్ట్‌ఫుడ్‌, టిపెన్‌ సెంటర్లు నిర్వహకులు ధరలు పెంచారు. ఈ ప్రభావం కూడా ప్రజలపై పడింది.

-గతంతో పోలిస్తే జిల్లాలో వాహనాల వినియోగం పెరిగింది. వ్యవసాయంలో యాంత్రీకరణ వచ్చిన తరువాత డీజిల్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో జనజీవనం ఆందోళనకు గురవుతోంది.

ఆటో చార్జీలు పెంచక తప్పదు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఆటో చార్జీలు పెంచక తప్పదు. ప్రస్తుతం ఉన్న చార్జీలు కంటే అదనంగా రూ.పది వసూలు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు మా జీవన విధానంపై పెను ప్రభావం చూపుతుంది. వెంటనే ధరలు తగ్గించాలి.

-తిరుమలరావు, ఆటో డ్రైవర్‌, పార్వతీపురం

================================

వెంటనే తగ్గించాలి..

డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపు ప్రభావం సామాన్య, మధ్యతరగతి వర్గాలపైనే పడుతుంది. ప్రధానంగా అన్ని రకాల వస్తువుల ధరల భారం మాలాంటి పేదలపై పడుతుంది. ప్రభుత్వం స్పందిం నిత్యావసర సరుకులు ధరలు తగ్గించకుండా చర్యలు తీసుకోవాలి.

- అప్పలనాయుడు, పార్వతీపురం

================================

తప్పనిసరి పరిస్థితుల్లో..

ఓపైపు పశ్చిమాసియాలో సంక్షోభం.. మరోవైపు చమురు కంపెనీలు నష్టాలను చవిచూస్తుం డడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర సర్కారు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాల్సి వచ్చింది. త్వరలో ఈ ధరలు తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో పూర్తిస్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయి.

బి.అశోక్‌, డీఎస్‌వో, పార్వతీపురం మన్యం

Updated Date - May 15 , 2026 | 11:49 PM