Share News

దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:17 AM

జిల్లా కేంద్రం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాడి చేసి, దోపిడీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్టు విజయనగరం డీఎస్పీ ఎస్‌.రాఘవులు తెలిపారు.

దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

విజయనగరం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాడి చేసి, దోపిడీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్టు విజయనగరం డీఎస్పీ ఎస్‌.రాఘవులు తెలిపారు. ఈ కేసుపై డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం నేతాజీనగర్‌ పూర్ణామార్కెట్‌కు చెందిన దార వెంకినాయుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 13న అర్ధరాత్రి 12 గంటల సమయంలో విశాఖ రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి.. విశాఖ నుంచి విజయనగరం వెళ్లేందుకు ఆటో బేరం కుదుర్చుకున్నాడు. ఆటో ఎక్కి.. అయ్యప్పనగర్‌ లేఅవుట్‌లో ఎవరూ లేని ప్రాంతంలో నిలుపుదల చేయమన్నా డు. జేబులో ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌ ఇవ్వాలని ఆటోడ్రైవర్‌ను బెదిరించాడు. దాడి చేసి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసన్స్‌, నగదును బలవంతంగా లాక్కొన్నాడు. అక్కడితో ఆగకుండా ఆటోను కూడా లాక్కెళ్లాడు. వెంటనే వెంకినా యుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సీఐ శ్రీనివాస్‌ సిబ్బంది, క్లూస్‌ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, నిందితుడి కదలికలపై దర్యాప్తు వేగవంతం చేశారు. పూల్‌బాగ్‌ లెప్రసీ కాలనీకి చెందిన నిందితుడైన రంపం త్రిమూర్తులను ఈనెల 14వ తేదీన డీటీసీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్‌, రూ.500నగదు, ఆటోను స్వాధీ నం చేసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి ఆదేశాల మేరకు త్రిమూ ర్తులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ శ్రీనివాస్‌, ఏఎస్‌ఐ అర్జున్‌, పీసీలు వాసు, షఫీలను డీఎస్పీ అభినందించారు.

Updated Date - Aug 16 , 2026 | 12:17 AM