Pensions... Boosting Enthusiasm పింఛన్.. జోష్ పెంచెన్
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:05 AM
Pensions... Boosting Enthusiasm శృంగవరపుకోట మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన తెలుగు దేశం నాయకుడు సర్పంచ్‌గా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే ఓ సారి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా ఎలాయినా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు. వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణను సొంత ఖర్చుతో చేపడుతున్నాడు. ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు.
పింఛన్.. జోష్ పెంచెన్
కొత్త పింఛన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్న టీడీపీ నాయకులు
స్థానిక పోరుకు కలిసివస్తుందని నమ్మకం
మరింత ధీమాగా ఎన్నికలకు వెళ్తామంటున్న కార్యకర్తలు
- శృంగవరపుకోట మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన తెలుగు దేశం నాయకుడు సర్పంచ్‌గా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే ఓ సారి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా ఎలాయినా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు. వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణను సొంత ఖర్చుతో చేపడుతున్నాడు. ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. అయితే గత వైసీపీ పాలనలో టీడీపీ అభిమానులన్న కారణంతో 25 మందికి సామాజిక ఫించన్‌లను రాకుండా చేశారు. వారంతా ఇప్పుడైనా న్యాయం చేయాలని తరచూ కోరుతుండడంతో ఇన్నాళ్లూ సమాధానం చెప్పలేకపోయేవాడు. ఇంకొందరు కొత్తవారు కూడా పింఛన్‌ల కోసం తరచూ సంప్రదిస్తున్నా జవాబు చెప్పలేని పరిస్థితి ఎదుర్కొన్నాడు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అర్హులందరికీ న్యాయం చేయగలనన్న ధీమాతో ఉన్నాడు.
శృంగవరపుకోట, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి):
కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఓ టెన్షన్ తీరింది. ఇన్నాళ్లూ సమావేశాల్లో కాని, ఇంటింటి పర్యటనలో కాని ప్రజల నుంచి వచ్చే విమర్శలు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. పింఛన్లపై భరోసా ఇవ్వలేక విసిగిపోయేవారు. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు నిర్ణయం తీసుకోవడమే కాకుండా వెంటవెంటనే దరఖాస్తులు ఆహ్వానించడంతో టీడీపీ శ్రేణులు హమ్మయ్యా అనుకుంటున్నారు. మరోవైపు అక్టోబరులో స్థానిక ఎన్నికలను ఎట్టి పరిస్థితిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉండడంతో నేతలకు కూడా మరింత ఉత్సాహం వచ్చింది. స్థానిక సమరానికి సిద్ధంకావాలనుకుంటున్నారు. స్థానిక పోరుకు ముందు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, అర్హులందరికీ ఫించన్‌లను మంజూరు చేయిస్తే గెలుపు తమదేనన్న ఽధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మండలంలోనూ 350 నుంచి 500 వరకు సామాజిక పింఛన్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10,000 నుంచి 12000 వరకు ఉంటారని అంచనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఇంతవరకు సామాజిక పింఛన్ల ఊసెత్తలేదు. దీంతో అర్హత కలిగి వారంతా లోలోన మండిపోతున్నారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరు కంటపడినప్పుడల్లా గ్రామాల్లోని టీడీపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారు. తమపై కక్ష గట్టిన వైసీపీ అర్హత వున్నా ఫించన్‌లను ఇవ్వకుండా అడ్డుకుందని, మన ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా పింఛన్‌లను ఇప్పించలేకపోతున్నారంటూ అంటుండడంతో వారికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.
- రూ.3వేలున్న సామాజిక పింఛన్‌ను కూటమి ప్రభుత్వం రూ.4వేలకు పెంచింది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంది. కొత్త పింఛన్ల మంజూరుకు మాత్రం కాస్త వెనుకంజ వేసింది. దీంతో అర్హుల్లో కొంత నైరాశ్యం ఉంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్న భయం నాయకులను వెంటాడుతోంది. కొత్త పింఛన్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో నాయకుల్లో భయం పోయింది. కొత్త ధైర్యం వచ్చింది.
పింఛన్ అర్హులకు ఈ పత్రాలు తప్పనిసరి
పింఛన్ కోసం దరఖాస్తు చేయదలిచేవారంతా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఉండాలి. వయసు నిర్ధారణ పత్రాలు అవసరం. వితంతు పింఛన్ కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఒంటరి మహిళ పింఛన్ కోసం 50 సంవత్సరాలు నిండినట్లు తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రం, దివ్యాంగ పింఛన్‌కైతే 40శాతంపైబడి దివ్యాంగత వున్నట్లు సదరం ధ్రువపత్రం తప్పనిసరి. డప్పు కళాకారులు, చేనేత, కళ్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు సెల్ఫ్‌డిక్లరేషన్‌తోపాటు పంచాయతీ ప్రత్యేక అధికారి ధ్రువీకరణ, సంబంధిత సహకార సంస్థల నుంచి అనుమతి పత్రాలు ఉండాలి.
------------------