Share News

Pension Hopes పింఛన్‌ ఆశలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:16 AM

Pension Hopes నూతన సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త పింఛన్లు కోసం దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయిం చింది.

 Pension Hopes పింఛన్‌ ఆశలు

  • మొదటి విడతగా వృద్ధులు, వితంతువులకు మంజూరు

  • జిల్లాలో మూడు వేలకు పైబడి అర్హుల ఎదురుచూపు

పార్వతీపురం,సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): నూతన సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త పింఛన్లు కోసం దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయిం చింది. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం.. వేలాది మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయలేదు. అయితే తాజాగా నూతన పింఛన్లపై ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొదటి విడతగా వృద్ధులతో పాటు వితంతువులకు ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై జిల్లా యంత్రాగానికి ఇంకా ఆదేశాలు రాలేదు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ కానున్న నేపథ్యంలో సెప్టెంబరు నెలాఖరు లేదా అక్టోబరు మొదటి వారంలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. జిల్లాలో కొత్తగా అన్ని రకాల సామాజిక పింఛన్లకు సంబంధించి ఎదురుచూస్తున్న వారి సంఖ్య 3460 మంది పైబడి ఉన్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా సుమారు రూ.రెండు కోట్ల వరకు సామాజిక పింఛన్ల కోసం ప్రతినెలా ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1,36,470 మంది లబ్ధిదారులకు 15 రకాల సామాజిక పింఛన్లు అందిస్తున్నారు. రూ.4 వేలు నుంచి రూ. 15 వేల వరకు వివిధ కేటగిరీల్లో అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ. 58.90 కోట్లు విడుదల చేస్తోంది. కాగా జిల్లాలో అర్హులందరూ కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. గతంలో పీజీఆర్‌ఎస్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో అర్జీలు ఇచ్చామని భావిస్తే.. పింఛన్లు మంజూరు జరిగే అవకాశం ఉండదు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ ప్రభావతిని వివరణ కోరగా.. ‘కొత్త సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లు మంజూరవుతాయి. ’ అని తెలిపారు.

90 శాతం పింఛన్ల పంపిణీ

గరుగుబిల్లి: జిల్లా పరిధిలో మంగళవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు 90 శాతం పంపిణీ జరిగింది. 15 మండలాలు, మూడు పట్టణాల పరిధిలోని 1,36,470 మంది పింఛన్‌దారుల కోసం ప్రభుత్వం రూ.58.90 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయాల సిబ్బంది మొదటి రోజు 1,23,132 మందికి గాను రూ. 52.78 కోట్లు పింఛన్‌ రూపంలో లబ్ధిదారులకు అందించారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వా ములయ్యారు. కాగా గ్రామాల్లో పింఛన్‌దారులు మృతి చెందితే ఆయా మొత్తాలను సకాలంలో జమ చేయాలని డీఆర్‌డీఏ పీడీప్రభావతి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. లేకుంటే చర్యలు తప్పవన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:16 AM