Peaceful on the First Day తొలిరోజు ప్రశాంతం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:42 AM
Peaceful on the First Day జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు 38 మంది విద్యార్థులు గైర్హాజర య్యారు. మొత్తంగా 68 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ విద్యార్థులు 10,568 మంది, ప్రైవేట్ విద్యార్థులు 78 మంది హాజరు కావాల్సి ఉంది. వారిలో రెగ్యుల్ విద్యార్థులు 10,537 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 71 మంది హాజరు కాగా ఏడుగురు రాలేదు.
సమయానికి కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు
38 మంది గైర్హాజరు
సీ సెంటర్లపై ప్రత్యేక నిఘా
పార్వతీపురం/సాలూరు రూరల్, మార్చి16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు 38 మంది విద్యార్థులు గైర్హాజర య్యారు. మొత్తంగా 68 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ విద్యార్థులు 10,568 మంది, ప్రైవేట్ విద్యార్థులు 78 మంది హాజరు కావాల్సి ఉంది. వారిలో రెగ్యుల్ విద్యార్థులు 10,537 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 71 మంది హాజరు కాగా ఏడుగురు రాలేదు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించగా.. విద్యా ర్థులంతా ఉదయం 8.45 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన వారు బస్సులతో పాటు ఆటోలను ఆశ్రయించారు. జిల్లాలో ఉన్న 21 సీ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని సీ సెంటర్లలో పరీక్ష ఆరంభానికి ముందే స్క్వాడ్ చేరుకుంది. పరీక్ష కేంద్రాల వద్ద వైద్యశిబిరాలతో పాటు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఈవో పి.బ్రహ్మాజీరావు, డిప్యూటీ డీఈవోలు బత్తుల రాజకుమార్, కృష్ణమూర్తి తదితరులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
నది దాటడమే పరీక్ష...
సీతానగరం/కొమరాడ, మార్చి16(ఆంధ్రజ్యోతి): సీతానగరం, కొమరాడ మండలాల్లో నదీ తీర గ్రామాలకు చెందిన టెన్త్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వగ్రామాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నది దాటుకుని వేరే గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. సీతానగరం మండలం గాదెలవలసకు చెందిన టెన్త్ విద్యార్థులు సువర్ణముఖినది నది దాటి బూర్జ జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇదే మండలం జానుమునివలస గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని యాళ్ల రేవతి తల్లి, బంధువు సాయంతో నది దాటి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బూర్జ పరీక్ష కేంద్రానికి చేరుకుంది. ఇక కొమరాడ మండలంలో కొట్టు, తుడుము గ్రామాలకు చెందిన టెన్త్ విద్యార్థులు నాగావళి నదిని దాటుకుని కొమరాడలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. గాదెలవలస లేదా సీతానగరంలో కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటే సుమారు 25 కిలో మీటర్లు చుట్టూ తిరిగి సీతానగరం మీదుగా బూర్జ కేంద్రానికి చేరుకోవాల్సి వచ్చేదని వారు వాపోతున్నారు. ఇక కొమరాడ మండలంలో ఉన్న నాగావళిపై పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో కొట్టు, తుడుము గ్రామాలకు చెందిన టెన్త్ విద్యార్థులు నదిని దాటుకుని కొమరాడలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.