Intermediate Examinations ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:24 AM
Peaceful Conduct of Intermediate Examinations జిల్లాలో 33 కేంద్రాల్లో సోమవారం ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి. కాగా విద్యార్థులంతా అరగంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు.
పార్వతీపురంటౌన్/బెలగాం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 33 కేంద్రాల్లో సోమవారం ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి. కాగా విద్యార్థులంతా అరగంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. జనరల్ గ్రూపులకు చెందిన 6107 విద్యార్థుల్లో 5,873 మంది, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 2902 మందికి గాను 2,570 మంది హాజరైనట్లు డీఐఈవో నాగేశ్వరరావు తెలిపారు. తొలిరోజు మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు 566 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా ఉండాలని, మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థుల కోసం తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు సరిగ్గా ఉండేలా చూడాలని సూచించారు.
నది దాటడమే పరీక్ష
కురుపాం, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో నాగావళి తీరాన ఉన్న పలు గ్రామాల విద్యార్థులకు నది దాటడమే పెద్ద పరీక్షగా మారింది. కొట్టు, తొడుము గ్రామాలకు చెందిన విద్యార్థులు సోమవారం ఇంటర్ పరీక్షలు రాయడం కోసం నానా అవస్థలు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. నది దాటుకుని కొమరాడలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. కాగా నది ఆవల నుంచి కొమరాడ వచ్చేసరికి సుమారు గంటన్నర సమయం పడుతుందని విద్యార్థులు వాపోతున్నారు. నదిలో ప్రస్తుతం మోకాళ్ల లోతులో నీరు ఉండడంతో రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని, దుస్తులు కూడా తడిసిపోవడంతో పరీక్ష కేంద్రాలకు ఎలా వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. చుట్టూ తిరిగి మండల కేంద్రానికి చేరుకోవాలంటే వ్యయప్రయాసలకు గురువుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నాగావళిపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.