PD Act if you commit cow slaughter గోవధకు పాల్పడితే పీడీ యాక్టు
ABN , Publish Date - May 24 , 2026 | 11:37 PM
PD Act if you commit cow slaughter గోవధకు పాల్పడితే పీడీ యాక్టు జిల్లాలో ఎవరైనా పశువుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడితే చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తప్పవని, పీడీయాక్టు ప్రయోగిస్తామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.
గోవధకు పాల్పడితే పీడీ యాక్టు
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు
ఎస్పీ దామోదర్
విజయనగరం, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎవరైనా పశువుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడితే చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తప్పవని, పీడీయాక్టు ప్రయోగిస్తామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. చట్టాలను అమలు చేయడంతో పాటు జంతువులను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రక్రియలో సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగు, డ్రోన్ నిఘా వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. గోవులను అక్రమంగా తరలించడం, హింసించడం అనుమతులు లేకుండా వధ శాలలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పారు.
జిల్లాలో చెక్‌పోస్టులు బలోపేతం చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో గోవుల అక్రమ రవాణాకు అవకాశం వున్న అన్ని దారుల్లో అధికారులు, సిబ్బందితో నిఘా పెట్టామని, వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. రాత్రి వేళల్లో వాహన తనిఖీలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి 25 మందిని అరెస్టు చేయడంతో పాటు 12 వాహనాలను, 156 పశువులను సీజ్ చేశామని తెలిపారు.