PD Act against rowdy sheeters రౌడీషీటర్లపై పీడీ యాక్ట్
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:59 PM
PD Act against rowdy sheeters జిల్లాలో గోవధ, రౌడీషీటర్లు, గంజాయి రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. పోలీసులు నలుగురిపై పీడీ యాక్టు నమోదు చేశారు. మరో నలుగురిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇంకో ఎనిమిది మందికి ఏడాది పాటు బెయిల్ రాకుండా చేశారు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయం వెనుక వీరి హస్తం ఉందని గుర్తించి జైలుకు పంపించారు. గంజాయి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో? వెతికే ప్రయత్నంలో పోలీస్ శాఖ ఉంది. పోలీసులు విజయనగరంలో పేట్రేగిపోతున్న ఈవ్‌టీజర్లు, రౌడీషీటర్లపై కూడా ఫోకస్ పెంచారు. గోవధపైనా డేగ కన్నువేశారు.
రౌడీషీటర్లపై పీడీ యాక్ట్
గంజాయి రవాణా, గోవధపై కూడా..
ఇప్పటివరకూ 8 మందిపై చర్యలు
విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు
- జిల్లా కేంద్రానికి చెందిన బేతలల్లూపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదుచేసి అరెస్టు చేశారు. పలు కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, ప్రజలను భయోందోళనకు గురిచెయ్యడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్పీ దామోదర్ పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఒక్కరే కాదు దాదాపు 8 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదుకావడంతో వారు సెంట్రల్ జైలులో ఉన్నారు.
- విజయనగరానికి చెందిన పఠాన్‌బాష ఆలీ కూడా పేరుమోసిన రౌడీషీటర్. ఇతనిపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. షెటిల్‌మెంట్లు, భయపెట్టడాలు, రియల్ ఎస్ట్‌ట్ వ్యాపారులతో గొడవలు తదితర కారణాలతో పఠాన్ బాషపై పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపారు.
- జిల్లాతో పాటు నగరంలో పశుమాంస విక్రయాలు, గోవుల అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. వైసీపీ ప్రభుత్వం గోవధ నిర్వాహుకులకు అండగా నిలవటమే కాకుండా వారికి పదవులు ఇచ్చి ప్రోత్సాహం అందించింది. వీరిపైనా పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ గోవధ, తరలింపును అడ్డుకుంటున్నారు.
విజయనగరం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గోవధ, రౌడీషీటర్లు, గంజాయి రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. పోలీసులు నలుగురిపై పీడీ యాక్టు నమోదు చేశారు. మరో నలుగురిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇంకో ఎనిమిది మందికి ఏడాది పాటు బెయిల్ రాకుండా చేశారు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయం వెనుక వీరి హస్తం ఉందని గుర్తించి జైలుకు పంపించారు. గంజాయి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో? వెతికే ప్రయత్నంలో పోలీస్ శాఖ ఉంది. పోలీసులు విజయనగరంలో పేట్రేగిపోతున్న ఈవ్‌టీజర్లు, రౌడీషీటర్లపై కూడా ఫోకస్ పెంచారు. గోవధపైనా డేగ కన్నువేశారు.
ఒడిశా వైపే..
జిల్లాలో వెలుగుచూస్తున్న గంజాయి రవాణాకు సంబంధించి మూలాలన్నీ ఒడిశా వైపే చూపిస్తున్నాయి. జిల్లాలో గంజాయి సాగు లేకపోయినప్పటికీ ఒడిశా నుంచి జిల్లా మీదుగా రవాణా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ప్రభుత్వం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటుచేసింది. దీంతో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. కేసులు నమోదుచేస్తున్నారు. నిందితుల ఆస్తులు జప్తు చేస్తున్నారు. అయినా సరే గంజాయి రవాణా అదుపులోకి రావడం లేదు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫ మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తూ గోవధ నిర్వహిస్తున్న వారిపై సైతం ఎస్పీ దామోదర్ నిఘా పెట్టారు. ఇందుకోసం అర్ధరాత్రి వేళ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైన గోమాంసం రవణాచేస్తే పీడీయాక్ట్ నమోదు చెయ్యాలని, జిల్లా పోలీస్ అధికారులకు ఇప్పటికే అదేశాలు ఇచ్చారు.
గంజాయి అక్రమ మార్గాలు ఎన్నో..
జిల్లాకు ఒడిశాతో పాటు చత్తీస్‌గడ్‌కు రోడ్డు మార్గం ఉంది. ఆపై రైల్వేపరంగా కూడా దగ్గర మార్గం. దీంతో అక్రమార్కులు ఒడిశా నుంచి గంజాయిని చాలా సులువుగా జిల్లా మీదుగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అయితే ఇలా రవాణా చేసి పట్టుబడుతోంది ఎక్కువగా ఒడిశా యువతే. ఆపై మన జిల్లాకు చెందిన విద్యార్థులు సైతం పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా గంజాయి హబ్‌గా మారిందన్న అనుమానాలు బలపడ్డాయి. ప్రధానంగా కాలేజీలు, విద్యాసంస్థలున్న చోట గంజాయి పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, కొత్తవలస ఎడ్యుకేషనల్ హబ్‌లుగా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. అటువంటి చోట ఎక్కువగా గంజాయి చలామణి అవుతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.
గంజాయిని మార్చేసి..
గంజాయిని ద్రవ పదార్థంగా మార్చుతున్నారు. రకరకాల రూపంలో తరలిస్తున్నారు. చివరకు కూరగాయల మాటున సైతం తరలిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న ఆ మధ్యన విశాఖలో చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి పట్టుబడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా చెలామణి అవుతున్న గంజాయి అంతా ఒడిశా నుంచి తెచ్చినదే. మన జిల్లాకు సంబంధించి రోడ్డు మార్గాల్లో చెక్‌పోస్టులు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు పెంచితే కొంత నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైనా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దూకుడుగానే ఉంది. వీరికి పోలీస్, ఎక్సైజ్ శాఖల సహకారం తోడైతే జిల్లా మీదుగా గంజాయి రవాణా, వినియోగం గణనీయంగా తగ్గించవచ్చు.
గస్తీ ముమ్మరం చేశాం
గంజాయి, గోమాంసం రవాణాపై ఫోకస్ పెంచాం. రాత్రీపగలు గస్తీ ముమ్మరం చేశాం. పట్టుబడిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదు. ఇప్పటికే ఈగల్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలు రంగంలోకి దిగాయి. అదే విధంగా గంజాయి, మత్తుపదార్థాలను పసిగట్టే ట్రైనింగ్ డాగ్‌లను జిల్లాకు తెప్పించాం. జిల్లా మీదుగా రవాణా చేస్తున్న వారిని గుర్తించి పెద్ద ఎత్తున గంజాయి పట్టుకుంటున్నాం. నిందితులపై కేసుల నమోదు మాత్రమే కాదు. ఏకంగా ఆస్తులను సైతం జప్తు చేస్తున్నాం.
- దామోదర్, ఎస్పీ, విజయనగరం