Share News

Payments చెల్లింపులు కావట్లే!

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:51 PM

Payments Are Not Being Released! జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కావడం లేదు. పథకంలో నిబంధనల మార్పే ఇందుకు కారణం.

Payments  చెల్లింపులు కావట్లే!
పార్వతీపురం మండలం జమదాల- తాళ్లబురిడి రహదారి నిర్మాణం పూర్తయినా మంజూరు కాని బిల్లు

  • వీడని చిక్కుముడి.. అప్‌లోడ్‌ కాని బిల్లులు

  • మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా చేపట్టిన పనులపై ప్రభావం

  • రూ.50 లక్షలకు దాటిన బిల్లులు మంజూరు కాని వైనం

పార్వతీపురం, జనవరి7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కావడం లేదు. పథకంలో నిబంధనల మార్పే ఇందుకు కారణం. ప్రస్తుతం బిల్లులు అప్‌లోడ్‌ కావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారాయనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

గతంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా సుమారు రూ.మూడు కోట్ల వరకు చెల్లింపులకు అవకాశం ఉన్న పనులెన్నో జిల్లాలో చేపట్టారు. ఆయా నిర్మాణాలు పూర్తయిన ప్రాప్తికి బిల్లుల చెల్లింపులు జరిగేవి.

ఏదైనా రహదారి నిర్మాణానికి రూ.50 లక్షలకు మించి చెల్లించకూడదనేది కొత్త నిబంధన. దీని ప్రకారం.. ఒక రహదారికి సుమారు రూ.3కోట్లు అవసరమైతే.. ఆ రోడ్డు పనులను ఆరు విభాగాలుగా విభజించి బిల్లులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గతంలో జిల్లాలో చేపట్టిన అనేక పనులకు నూతన నిబంధనల ప్రకారం బిల్లుల చెల్లింపులు కావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

జిల్లాలో పంచాయతీరాజ్‌, గిరిజన ఇంజనీరింగ్‌ శాఖల ఆధ్వర్యంలో జరిగిన వివిధ పనులకు సంబంధించి సుమారు రూ.38 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల గోప్యంగా ఉంచుతున్నారు. రూ. 50 లక్షల దాటిన పనులకు బిల్లుల చెల్లింపులు కావడం లేదనే విషయాన్ని గతంలో జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్‌ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా.. ఇంతవరకు పరిస్థితిలో ఏ మార్పూ లేదు.

అప్‌లోడ్‌ కాని బిల్లులు...

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లింపులు కావడం లేదు. ప్రస్తుతం పథకంలో నిబంధనలు మారడంతో రూ.50 లక్షలకు మించిన బిల్లులు అప్‌లోడ్‌ కావడం లేదు. పార్వతీపురం నియోజకవర్గం విషయానికొస్తే.. ఉపాధి హామీ పథకం కింద పార్వతీపురం మండలంలో వీరభద్రపురం-అంటివలస రోడ్డును రూ. కోటితో పూర్తి చేశారు. సీతానగరం మండలంలో సుమిత్రపురం-వల్లర గొడబ రహదారి పనులు రూ.కోటి 90 లక్షలతో పూర్తయ్యాయి. ఈ విధంగా జిల్లాలో అనేక రహదారుల నిర్మాణం పూర్తయినా బిల్లులు మాత్రం మంజూరు కావడం లేదు.

అభివృద్ధి ఎలా?

గిరిజన, మైదాన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల పనులకు శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రభుత్వ కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు కూడా బిల్లులు చెల్లించింది. దీంతో నిధుల మంజూరుకు ఢోకా ఉండదనే భావనతో ఎంతోమంది పనులకు ముందుకొచ్చారు. అయితే కేంద్రం నిబంధనలు మార్చడంతో ప్రస్తుతం బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌ పడింది. మరోవైపు నాబార్డు నిధులతో చేపట్టిన పనులకు కూడా బిల్లులు మంజూరు కావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే.. జిల్లా అభివృద్ధి పనులపై ప్రభావం పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి నగేష్‌ను వివరణ కోరగా.. అభివృద్ధి పనులకు సంబంధించి తమ శాఖ ద్వారా బిల్లులు చెల్లింపులు వేగవంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Jan 07 , 2026 | 11:51 PM