Share News

Payment of Bills మార్చి 31లోగా బిల్లుల చెల్లింపు

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:44 PM

Payment of Bills by March 31 జిల్లాలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న రహ దారులతో పాటు ఇతర అభివృద్ధి పనుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి మార్చి31లోగా చెల్లింపులు జరుగుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Payment of Bills  మార్చి 31లోగా  బిల్లుల చెల్లింపు
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ కృష్ణతేజ

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ

పార్వతీపురం, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న రహ దారులతో పాటు ఇతర అభివృద్ధి పనుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి మార్చి31లోగా చెల్లింపులు జరుగుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ జిల్లాలో మార్చి 15 వరకు పూర్తయిన అన్ని పనులకు సంబంధించిన బిల్లులను అదేనెల 31లోపు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేసి బిల్లులను అప్‌లోడ్‌ చేయాలి. ఇంజనీరింగ్‌ శాఖ ఉన్నతాధికారులు, ఎంపీడీవోలు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలి. అక్టోబరు నెల వరకు పూర్తయిన నిర్మాణణలకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు చెల్లింపులు జరిగాయి. మిగిలిన పెండిగ్‌ బిల్లులను కూడా చెల్లిస్తున్నాం. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధి హామీ పనులన్నీ మార్చి 31నాటికి పూర్తి కావాలి. లేదా ప్రారంభ దశలో ఉండాలి. సగంలో నిలిచిపోయిన పనులకు అనుమతులు లభించవు. మార్చి 15 తర్వాత సమర్పించే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగితే అధికారులదే బాధ్యత. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం రూ.30 వేల కోట్లు కేటాయించాం. ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలను పూర్తిచేస్తే కొత్త పనులకు అవకాశం ఉంటుంది.’ అని తెలిపారు.

పన్నుల వసూళ్లపై దృష్టి

పన్నుల వసూళ్లు, పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని కమిషనర్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 15లోగా శతశాతం పన్నులు వసూలు చేయాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ రామచంద్రరావు, ఉమ్మడి జిల్లా సీఈవో సత్య నారాయణ, డీడీవో రమేష్‌ రామన్‌, డీపీవో కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

గడువులోగా పూర్తయ్యేనా?

పార్వతీపురం, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపో నెంట్‌ కింద చేపడుతున్న పనులను మార్చి 15లోపు పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే నిధులు వెనక్కి మళ్లే పరిస్థితి ఉంది. వాస్తవంగా జిల్లాకు ఉపాధి మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.214 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. అందులో సుమారు రూ.వంద కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. మిగిలిన రూ.114 కోట్ల పనులను మార్చి 15 లోపు పూర్తి చేసి 31 నాటికి బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. లేకుంటే నిధులు మంజూరుకావు. ఉపాధి హామీ పథకం నూతన నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ మేరకు కేంద్రం తన వాటాగా 60 శాతం మాత్రమే నిధులు మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు జిల్లాలో పూర్తయిన పనులకు సంబంధించి రూ.25 కోట్ల మేర బిల్లులను అప్‌లోడ్‌ చేశారు. మరో 75 కోట్ల రూపాయల బిల్లులను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. గుమ్మలక్ష్మీపురం మండలంలో రూ.32 కోట్లు, కొమరాడ మండలంలో సుమారు రూ. 38 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో చేపడుతున్న పనులు వేగవంతంగా పూర్తి కావల్సి ఉంది. సీతంపేట రూ.20.46 కోట్లు, పాచిపెంట రూ. 18.68 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే మార్చి 15లోపు ఆయా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులపై ఉంది. దీంతో వారు పరుగులు పెడుతున్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హామీ ఇవ్వడంతో ఇక పనులను గడువులోగా పూర్తి చేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులపై పడింది. ‘మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు మార్చి 15లోపు పూర్తి చేసి బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి. వాటిని పూర్తి చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త పనులు మంజూరవుతాయి.’ అని డ్వామా పీడీ రామచంద్రరావు తెలిపారు.

Updated Date - Feb 05 , 2026 | 11:44 PM