Hospitals ఆసుపత్రుల్లో అవస్థలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:18 AM
Patients' Plight in Hospitals జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వసతి సమస్య వేధిస్తోంది. పూర్తిస్థాయిలో భవనాలు లేక, నిర్మాణాలు పూర్తయినవి ప్రారంభానికి నోచుకోకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు.
పూర్తికాని అదనపు భవన నిర్మాణాలు
కొన్నిచోట్ల ప్రారంభానికి నోచని వైనం
సీజన్ మార్పుతో పెరుగుతున్న రోగుల సంఖ్య
బెడ్లు చాలక ఇక్కట్లు
నేడు వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష
సమస్యలు పరిష్కరించాలని ప్రజల విన్నపం
పార్వతీపురం, జూన్28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వసతి సమస్య వేధిస్తోంది. పూర్తిస్థాయిలో భవనాలు లేక, నిర్మాణాలు పూర్తయినవి ప్రారంభానికి నోచుకోకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం సీజన్ మార్పుతో ఆసుపత్రులకు జ్వర పీడితుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో బెడ్లు చాలక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గరేసి రోగులు సర్దుకోవాల్సి వస్తోంది.
ఇదీ పరిస్థితి..
- పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రి వసతుల కల్పనలో ఇంకా అప్‌గ్రేడ్ కాలేదు. ఇక్కడ 150 పడకలు ఉన్నా.. పూర్తిస్థాయిలో గదులు లేవు. తాజాగా ఆదివారం జిల్లా కేంద్రాసుపత్రిలో ఇన్‌పే షెంట్ల సంఖ్య 318గా నమోదైంది. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరేసి రోగులకు వైద్య సేవలు అందించారు.
- కురుపాం సీహెచ్‌సీలో అదనపు భవన నిర్మాణాలు పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచు కోవడం లేదు. ఇక్కడ 32 పడకలు ఉన్నాయి. ఒక్కో వార్డులో పది మంచాల చొప్పున ఏర్పాటు చేశారు. అయితే రోగుల సంఖ్య పెరగడంతో ఆదివారం ఎక్స్‌రే గదితో పాటు వరండాలో మంచాలు వేసి రోగులకు వైద్యం అందించారు.
- సాలూరు ఏరియా ఆసుపత్రిలో 102 మంచాలు ఉన్నప్పటికీ 152 మంది వరకూ ఇన్‌పేషెంట్లు ఉన్నారు. సాలూరు పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి రోగులు తరలి వస్తుండడంతో ఆసుపత్రి కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మంచాల సంఖ్య పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
- గుమ్మలక్ష్మీపురం: భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవన నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో పాత భవనంలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉండగా ఇన్‌పేషెంట్లు 66 మంది ఉన్నారు. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు రోగులు ఉండాల్సి వస్తోంది.
- ‘జిల్లాలోని భద్రగిరి, కురుపాం ఆసుపత్రి భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభిస్తాం. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.’ అని డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు తెలిపారు.
దోమ తెరలు వచ్చేదెప్పుడు?
జిల్లాకు 4 లక్షల దోమతెరలు అవసరమని జిల్లా మలేరియా అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ఏడాది మార్చిలో 26,339 మాత్రమే వచ్చాయి. వాటిని అధికారులు 717 మలేరియా హైరిస్క్ గ్రామాల్లో ఏప్రిల్ నెలలో పంపిణీ చేశారు. మిగిలిన జిల్లాకు దోమతెరలు ఎప్పుడొస్తాయి..? ఇంకెప్పుడు పంపిణీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ‘జిల్లాకు మొదటి దశలో 26,339 దోమతెరలు వచ్చాయి. రెండో దశలో 90 వేలు, మూడో దశలో పూర్తిస్థాయిలో మన్యానికి దోమతెరలు రానున్నాయి.’ అని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు.
నేడు సమీక్ష...
కలెక్టరేట్‌లో సోమవారం వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సమీక్షించనున్నారు. జ్వరపీడితుల సంఖ్య, ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి, ఇన్‌పేషెంట్లు, వసతుల కల్పన, భవనాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి తగు పరిష్కారం చూపాలని జిల్లావాసులు కోరుతున్నారు. పార్వతీపురం, సీతంపేట మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.