Share News

Development ఉపాధికి మార్గం.. అభివృద్ధికి ఊతం

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:57 PM

Path to Employment, Boost to Development విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో మన్యం జిల్లా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రధానంగా పర్యాటక, రవాణా రంగాలకు గ్రోత్‌ ఇంజన్‌గా మారనుంది.

 Development ఉపాధికి మార్గం..  అభివృద్ధికి ఊతం

  • ప్రత్యక్షంగా.. పరోక్షంగా యువతకు ఉపాధి

  • పర్యాటకంతో పాటు పారిశ్రామిక ప్రగతికి అవకాశం

  • కార్గో ద్వారా అటవీ ఉత్పత్తుల రవాణాకు చాన్స్‌

  • తద్వారా గిరిజన రైతులకు మేలు

పార్వతీపురం, జూలై31(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో మన్యం జిల్లా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రధానంగా పర్యాటక, రవాణా రంగాలకు గ్రోత్‌ ఇంజన్‌గా మారనుంది. ఉపాధి కేంద్రంగా కూడా వర్థిల్లనుంది. పారిశ్రామిక కారిడార్‌ విస్తరణతో పాటు ఎయిర్‌పోర్టులో కార్గో సౌకర్యం వల్ల అటవీ ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమం అవుతుంది. మొత్తంగా రానున్న పదేళ్లలో మన్యం జిల్లా రూపురేఖలు మారే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇదీ పరిస్థితి..

- సాలూరులో జూట్‌ ఫ్యాక్టరీతో పాటు సీతానగరం మండలంలో పవర్‌ప్లాంట్‌ , లచ్చయ్యపేటలోని చక్కెర కర్మాగారం మూతపడ్డాయి. దీంతో ఇక్కడి యువత ఇతర రాష్ర్టాలకు వలసబాట పడుతున్నారు. పట్టుమని పది మందికి ఉపాధిని ఇచ్చే పరిశ్రమలు జిల్లాలో లేవు. పారిశ్రామికంగా అభివృద్ధి లేకపోవడంతో ఐటీఐ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు, యువత ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుతో ఈ పరిస్థితి మారనుంది. జిల్లా యువతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు మన్యం జిల్లా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

- ఎత్తయిన కొండలు, జలపాతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి సహజ సిద్ధ ప్రాంతాలతో మన్యం జిల్లా పర్యాటకానికి కేరాఫ్‌గా నిలుస్తోంది. కానీ పర్యాటకంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే.. సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయం నుంచి నేరుగా జిల్లాకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరగనుంది. దీంతో జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. అంతేకాకుండా స్థానిక గిరిజన యువతకు కూడా ఉపాధి దొరుకుతుంది.

- భోగాపురం విమానాశ్రయం వల్ల ఇతర ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా విజయనగరం, సాలూరు, పాలకొండ, శంబర ప్రాంతాల్లో ఉన్న పైడితల్లి, శ్యామలాంబ, కోటదుర్గమ్మ, పోలమాంబ ఆలయాలకు భక్తుల తాకిడి పెరగనుంది. తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వరాలయం ఆలయానికి ఇతర రాష్ర్టాల నుంచి ప్రజలు రానున్నారు. అదే విధంగా జిల్లాకు సమీపంలో ఉన్న ఒడిశా రాష్ట్రం రాయగడ మజ్జిగౌరమ్మ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు క్యూ కట్టనున్నారు. ఇక ఎయిర్‌పోర్టు నుంచి పూరీ జగన్నాథుని ఆలయానికి నేరుగా జనం చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఆయా ప్రాంతవాసులతో పాటు వాహనదారులకు మేలు జరుగుతుంది.

- జిల్లాలో అత్యధిక గిరిజన కుటుంబాలకు జీడిపంటే జీవనాధారం. కానీ జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ కేవలం ఒకటి మాత్రమే ఉంది. దీంతో గిరిజన రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే జీడి పిక్కలను కొనుగోలు చేసి కార్గో ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ఆయా కుటుంబాలకు ఆర్థికంగా భరోసా లభిస్తుంది. అదేవిధంగా జిల్లాలో కొండచీపుర్లు తయారీతో పాటు చింతపండు, తేనె, తదితర అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తోంది. వాటిని కూడా కార్గో ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది మన్యం యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. పనుల కోసం విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లే అవసరం కూడా ఉండదు. ఇకపోతే మన్యం జిల్లాలో పండే పసుపునకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉంది. అయితే దీనికి సబంధించి సాలూరులో తప్ప మరెక్కడా పరిశ్రమలు లేవు. ఈ నేపథ్యంలో పసుపునకు కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తే గిరిజన రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలగుతుంది

Updated Date - Jul 31 , 2026 | 11:57 PM