Share News

పాసు పుస్తకాలు ఇచ్చారు.. రికార్డుల్లో పేర్లేవీ?

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:21 AM

మండలంలోని కాపుశంభం గ్రామంలో సుమారు 30 మంది చిన్న, సన్నకారు రైతులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవా రం నిరసన చేపట్టారు.

 పాసు పుస్తకాలు ఇచ్చారు.. రికార్డుల్లో పేర్లేవీ?

  • కాపుశంభంలో రైతుల నిరసన

గరివిడి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాపుశంభం గ్రామంలో సుమారు 30 మంది చిన్న, సన్నకారు రైతులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవా రం నిరసన చేపట్టారు. 2005వ సంవత్సరంలో కాపుశం భాంకు చెందిన సుమారు 30 మంది రైతులకు ఒక్కో రైతుకు 20 నుంచి 30 సెంట్లు చొప్పున పంచాయతీ సర్వే నెం.1లో అప్పటి ప్రభుత్వం పాసు పుస్తకాలు ఇచ్చింది. అయితే భూములు పొందిన లబ్ధిదారుల పేర్లు రెవెన్యూ రికార్డులలో మాత్రం నమోదు చేయలే దు. రెవెన్యూ రికార్డులు, వన్‌బీలో రైతుల పేర్లు లేవు. ఇదే సర్వే నెంబరులో సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబరులో చిన్న తరహా పరి శ్రమల నిర్మాణాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎం ఎస్‌ఎంఈ పార్కుకు 25 ఎకరాలు కేటాయించింది. అయితే ఇప్పటికే 2005వ సంవత్సరంలో పట్టాలు పొం దిన రైతులకు అప్పటి రెవెన్యూ అధికారులు భూమి ఎక్కడ కేటాయించింది చెప్పకపోవడంతో రైతులు తమకు నచ్చినచోట జీడిమామిడి తోటలు వేసుకుని పండిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించిన 25 ఎకరాల్లో తమ పేరు మీద ఉన్న భూములు ఉన్నాయో.. లేవో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది నాయకులు ఈ ఎంఎస్‌ ఎంఈ పార్కుకు కేటాయిం చిన 25 ఎకరాల్లో వారి కుటుంబాల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకున్నారని, తద్వారా ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో నష్టపరిహారం పొందేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమస్యపై కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం జరగకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులకు చీపురుపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు, రమేష్‌ రాజు తదితరులు తమ మద్దతును తెలిపారు.

Updated Date - Jun 13 , 2026 | 12:21 AM