Zilla Parishad పార్వతీపురం జిల్లా పరిషత్
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:55 PM
Parvathipuram Zilla Parishad కొత్త జిల్లాలకు త్వరలోనే జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వాటి ఏర్పాటు తర్వాతే జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దీనిపై స్పష్టంగా సంకేతాలిచ్చారు.
సంకేతాలిచ్చిన ఉప ముఖ్యమంత్రి
పార్వతీపురం, మార్చి7(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలకు త్వరలోనే జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వాటి ఏర్పాటు తర్వాతే జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దీనిపై స్పష్టంగా సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో త్వరలోనే జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మొదటిగా సిబ్బంది నియామకం పూర్తిచేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మన్యం జిల్లా ఏర్పడి సుమారు నాలుగేళ్లవుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జడ్పీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలను పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా నిర్వహిస్తామని పాలకులు, అధికారులు చెప్పినా.. ఇంతరకు అది కార్యరూపం దాల్చలేదు. దీంతో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు , జడ్పీ సభ్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవంగా జిల్లాల విభజన తర్వాత శ్రీకాకుళం పరిధిలో ఉన్న పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యంలో కలిసింది. దీంతో దాని పరిధిలోని జడ్పీ సభ్యులంతా శ్రీకాకుళం జడ్పీకి వెళ్లాల్సి వస్తోంది. ఇక పార్వతీపుం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, విజయనగరం జడ్పీకి హాజరవ్వాల్సి వస్తోంది. జిల్లాలో ఎంపీడీవోలు, ఉద్యోగుల బదిలీలు పదోన్నతలు కూడా ఉమ్మడి జడ్పీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే త్వరలో పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీ ఏర్పాటైతే ప్రజాప్రతినిధులు, అధికారులకు తిప్పలు తప్పనున్నాయి.
తీవ్ర పోటీ..
రిజర్వేషన్ ప్రాతిపదికన పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీ సామాజికవర్గానికి, పాలకొండ, సాలూరు కురుపాం, నియోజకవర్గాలు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించబడ్డాయి. దీంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు ఆ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. జిల్లా పరిషత్ ఏర్పాటైతే.. జడ్పీ పీఠం ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో వేచి చూడాల్సి ఉంది. జిల్లాలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీకి చెందిన బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు నామినేటెడ్ పదవులు తప్ప నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం లేదు. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి జడ్పీ పీఠం కేటాయిస్తే.. ఎన్నికలు పోటీపోటీగా జరిగే అవకాశం ఉంది. ఎస్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి జడ్పీ పీఠం కేటాయిస్తే.. ఆయా సామాజికవర్గాలకి చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించనున్నారు. ఉమ్మడి జడ్పీ పరిధిలో ఉన్న 15 మంది జడ్పీటీసీ సభ్యులంతా వైసీపీకి చెందిన వారే. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలన్నీ ఆ పార్టీ గెలుచుకుంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండడంతో వైసీపీ, కూటమి నేతల మధ్య ‘నువ్వా నేనా’ అన్న విధంగా పోటీ జరగనుంది.