47-year association! 47ఏళ్ల అనుబంధాన్ని వీడి!
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:07 AM
Parting ways after a 47-year association! ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ విభజనకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఉన్న 11 మండలాలు 47ఏళ్ల అనుబంధం నుంచి వేరు కానున్నాయి. ఇకపై పార్వతీపురం మన్యం జడ్పీలో భాగం కానున్నాయి. జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా గురువారంతో ముగియనుంది. శుక్రవారమే కొత్త జడ్పీలో అధికారులు, సిబ్బంది బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
15 మండలాలతో 25న మన్యం జిల్లాలో నూతన ప్రజాపరిషత్ ఏర్పాటు
అధికారులు, సిబ్బంది కేటాయింపు పూర్తి
నేటితో ముగియనున్న జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం
విజయనగరం కంటోన్మెంట్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ విభజనకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఉన్న 11 మండలాలు 47ఏళ్ల అనుబంధం నుంచి వేరు కానున్నాయి. ఇకపై పార్వతీపురం మన్యం జడ్పీలో భాగం కానున్నాయి. జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా గురువారంతో ముగియనుంది. శుక్రవారమే కొత్త జడ్పీలో అధికారులు, సిబ్బంది బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇదివరకే రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అందుకు అనుగుణంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియను చకాచకా చేపట్టింది. ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జడ్పీ అధికారుల విభజన ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ నెల 24తో జడ్పీ విభజన పూర్తిస్థాయిలో జరగనుంది. కాగా నేడు పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్న తరుణంలో విజయనగరం జడ్పీలో జడ్పీటీసీలు ఆత్మీయంగా సమావేశం కావాలని నిర్ణయించారు.
నాటి నుంచి నేటి వరకు
- 1979, జూన్ 1న ఉమ్మడి అవిభక్త శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా ఆవిర్భవించింది. నాడు తాలూకా సమితిల ఏలుబడిలో ఉన్న జిల్లా తర్వాత మండల వ్యవస్థతో (34మండలాలతో) 47ఏళ్లుగా నేటివరకూ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలలో భాగంగా నేటి వరకు ఉన్న 34మండలాల్లో 11 మండలాలు రేపటి (శుక్రవారం) నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ప్రజా పరిషత్‌లో విలీనం కానున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి చేరిన నాలుగు మండలాలు మన్యం జిల్లా పరిషత్‌లో కలువ నున్నాయి.
- ఈనెల 25న నూతనంగా ఆవిర్భావం కానున్న పార్వతీపురం మన్యం జిల్లా ప్రజపరిషత్‌లో 15మండలాలు విలీనం కానున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సాలూరు, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురంతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, కొత్తూరు మండలాలు విలీనం కానున్నాయి.
అధికారుల కేటాయింపు ఇలా...
నూతనంగా ఏర్పాటు కానున్న ఈ జిల్లా ప్రజాపరిషత్‌కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 19మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. అందులో ఇద్దరు ఏవోలు, నలుగురు సీనియర్ సహాయకులు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఒక రికార్డు అసిస్టెంటు, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లతో పాటు ఒక డ్రైవరు, ఒక స్టెనో పోస్టులను కేటాయించినట్లు జడ్పీ సీఈవో ఎ.లవరాజు తెలిపారు.
27మండలాలతో విజయనగరం జడ్పీ
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 34మండలాల్లో 11మండలాలు పార్వతీపురం మన్యం జిల్లా ప్రజాపరిషత్‌కు కేటాయించగా మిగిలిన 23 అవశేష మండలాలకు అదనంగా నూతనంగా కలిసిన రాజాం నియోజకవర్గంలోని రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర మండలాలతో కలిసి మొత్తం 27మండలాలతో విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ ఉండబోతుంది. ఇక్కడకు శ్రీకాకుళం జిల్లానుంచి 11మంది అధికారులు, సిబ్బంది రానున్నారు.
మన్యం జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
పార్వతీపురం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో కొనసాగుతున్న జడ్పీ పాలకవర్గం గడువు గురువారం ముగియనుంది. సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల జడ్పీటీసీలు, శ్రీకాకుళం జడ్పీ పరిధిలో పాలకొండ నియోజకవర్గ జడ్పీటీసీ సభ్యులంతా మాజీలు కానున్నారు. కాగా శుక్రవారం నుంచి పార్వతీపురం జిల్లాలో జడ్పీ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నర్సిపురంలోని ఓ భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎన్నికలు జరిగే వరకు జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వ్యవహరించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాలమేరకే విభజన
ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ విభజన, నూతనంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రజాపరిషత్ ఏర్పాటు, ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేస్తున్నామని ఉమ్మడి జడ్పీ సీఈవో ఎ.లవరాజు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈనెల 25(శుక్రవారం) నుంచే వేర్వేరుగా జిల్లా ప్రజాపరిషత్ పరిపాలన ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని, ఉన్నతాధికారుల ఆమోదం కూడా లభించిందని చెప్పారు.