Share News

Parking is a problem పార్కింగ్‌ కష్టమే

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:20 AM

Parking is a hassle. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెడితే చాలు బాదుడే బాదుడు. ఇంత వరకు విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం తహతహలాడిన ప్రజలు, ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు శ్రామికులు ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ద్విచక్రవాహనమో, కారో ఉండాలి.

Parking is a problem పార్కింగ్‌ కష్టమే
ఎయిర్‌పోర్టులో ఎండలోనే వాహనాలు

పార్కింగ్‌ కష్టమే

భోగాపురంలో బాదుడే బాదుడు

విమానాశ్రయంలో పార్కింగ్‌ ఫీజులు చూసి అమ్మో అంటున్న వాహనదారులు

వాహనానికి నీడ కల్పించని నిర్వాహకులు

భోగాపురం, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెడితే చాలు బాదుడే బాదుడు. ఇంత వరకు విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం తహతహలాడిన ప్రజలు, ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు శ్రామికులు ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ద్విచక్రవాహనమో, కారో ఉండాలి. ఎంత సమయం వాహనం ఉంచితే అంత చార్జీ చెల్లించాల్సిందే. పెరిగే సమయానికి అనుగుణంగా అధిక మొత్తంలో చార్జీ వసూలు చేస్తున్నారు. దీనిపై వాహన చోదకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బయట ఎక్కడైనా వాహనం ఉంచి లోపలికి వెళ్లాలన్నా సెక్యూరిటీ సిబ్బంది వాహనాన్ని గుర్తించి నేరుగా పార్కింగ్‌ స్థలానికి పంపిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకి దూరంగా వాహనం నిలుపుతామని చెబితే అడ్డుకొంటున్నారని, ప్రశ్నిస్తే సెక్యూరిటీ వచ్చి దౌర్జన్యంగా దుర్భాషలాడుతున్నారని వాహనదారులు చెబుతున్నారు. అధిక మొత్తంలో చార్జీ వసూలు చేస్తున్నా వాహనాలకు కనీస రక్షణ కల్పిచడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు అన్నీ ఆరుబయటే ఉంచాల్సిందే. వాహనాలకు రక్షణగా ఎటువంటి షెడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనాలు పాడవుతున్నాయనేది చోదకుల ఆవేదన.

ఫ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న శ్రామికులకు కూడా ఇబ్బంది తప్పడం లేదు. ఎయిర్‌పోర్టుకు రావాలంటే ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. ద్విచక్రవాహనాలపై రావాల్సిందే. వారి దగ్గర కూడా అందరిలా పార్కింగ్‌కి చార్జీ వసూలు చేస్తున్నారు. ఇచ్చిన వేతనం వారే తీసుకొంటున్నట్లు ఉందని శ్రామికులు వాపోతున్నారు.

వాహనాలను దూరంగా నిలిపేస్తూ..

పార్కింగ్‌ ధరలు అధికంగా ఉండడంతో చాలా కార్లు ఎయిర్‌పోర్టుకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారి, ట్రంపెట్‌ ప్రాంతంలో ఉండిపోతున్నాయి. విమానం వచ్చే సమయం తెలుసుకొని ఎయిర్‌పోర్టులో 30 నిమిషాల్లో సంబంధిత వ్యక్తులను(పాసింజర్లు, యజమాన్లు) ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి బయటకి తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. అక్కడే ఉండి పాసింజర్ల కోసం వేచి చూస్తే అధిక మొత్తంలో పార్కింగ్‌కి చెల్లించాల్సి వస్తుందని, ఆ మొత్తాన్ని పాసింజర్‌ నుంచి వసూలు చేయాల్సి వస్తోందని ట్యాక్సీ డ్రైవర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా పార్కింగ్‌కి రక్షణ కలిగించేలా షెడ్లు ఏర్పాటు చేసి ధరలు తగ్గించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

పార్కింగ్‌ ధరలు ఇలా..

సమయం కారు కమర్షియల్‌ కారు ద్విచక్రవాహనం

30 నిమషాల వరకు రూ.100 రూ.200 రూ.20

ఆపై గంట వరకు రూ.150 రూ.300 రూ. 30

1నుంచి 2 గంటల వరకు రూ.200 రూ.400 రూ.50

అదనంగా గంటకు రూ.50 రూ.100 రూ.20

24 గంటలకు రూ.450 రూ.600 రూ.130

Updated Date - Aug 20 , 2026 | 12:20 AM