Parishad Polls పరిషత్ పోరు.. బరిలో నిలిచేదెవరో?
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:23 AM
Parishad Polls: Who Will Make It to the Fray? కూటమి పార్టీల మధ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు అంశాన్ని ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికే అప్పగించాలని అధిష్ఠానాలు నిర్ణయించాయి. ఈ మేరకు జిల్లా నేతలు, సమన్వయ కమిటీలకు బాధ్యత అప్పగించాయి. జడ్పీ చైర్మన్ స్థానాల వరకు కూటమి పార్టీల రాష్ట్ర నాయకత్వం సర్దుబాటు చేయనుంది. కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో జడ్పీటీసీలుగా బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది తేలనుంది.
స్థానికంగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాటు
జిల్లా నేతలు, సమన్వయ కమిటీలకు బాధ్యత
అభ్యర్థుల్లో టెన్షన్
పార్వతీపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కూటమి పార్టీల మధ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు అంశాన్ని ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికే అప్పగించాలని అధిష్ఠానాలు నిర్ణయించాయి. ఈ మేరకు జిల్లా నేతలు, సమన్వయ కమిటీలకు బాధ్యత అప్పగించాయి. జడ్పీ చైర్మన్ స్థానాల వరకు కూటమి పార్టీల రాష్ట్ర నాయకత్వం సర్దుబాటు చేయనుంది. కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో జడ్పీటీసీలుగా బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది తేలనుంది. అయితే బీ ఫారాలు దక్కేది ఎవరికి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై స్పష్టత లేకపోవడంతో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది.
- జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 127 మంది, 226 ఎంపీటీసీ స్థానాలకు 1267 మంది నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి.. పలు కారణాలతో కొన్ని పత్రాలను తిరస్కరించారు. ప్రధానంగా 86 ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 1181 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో టీడీపీ నుంచి 420 , జనసేన పార్టీ 188 , బీజేపీ నుంచి 18 నామినేషన్ దాఖలయ్యాయి. దీంతో ఎంపీటీసీల స్థానాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- ఇక జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 16 నామినేషన్లను తిరస్కరించి.. 111ను ఆమోదించారు. జడ్పీటీసీ అభ్యర్థులుగా కూటమి పార్టీల నుంచి 61 మంది నామినేషన్లు వేశారు. ఇందులో టీడీపీ నుంచి 37 , జనసేన 20 , బీజేపీ నుంచి నాలుగు నామినేషన్లు ఉన్నాయి. మొత్తంగా ఒక్కో స్థానంపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించడం చర్చనీయాంశమవుతోంది. ఈ అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరణకు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పొత్తు ధర్మం పక్కన పెట్టి.. ప్రతిఒక్కరూ స్థానికంగా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఏదేమైనా బీ ఫారాలు దక్కిన అభ్యర్థులు ఎవరో.. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్నది నామినేషన్ల ఉపసంహరణ తర్వాత స్పష్టం కానుంది. బీ-ఫారాలను ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల్లోపు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందించాల్సి ఉంది.
- స్థానిక పరిస్థితులు, బలాబలాలను దృష్టిలో పెట్టుకుని సీట్లు సర్దుబాటు చేసుకోవాలని పార్టీ అధిష్ఠానాలు ఆదేశించడంతో కూటమి పొత్తు ధర్మం ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాల్సి ఉంది. పలు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది.
ఆ స్థానాల నుంచి పోటీ చేసేది ఎవరు?
జిల్లాలో పార్వతీపురం జడ్పీటీసీ అభ్యర్థిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు సీటు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించడంతో పురపాలక సంఘం ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. దీనిపై జెంటిల్‌మెన్ ఒప్పదం కూడా కుదిరినట్టు ప్రచారం జరిగింది. కానీ పార్వతీపురం జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు గొట్టాపు వెంకటనాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ మండలం నుంచి కూటమి పార్టీ నుంచి ఎవరో పోటీ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బలిజిపేట జడ్పీటీసీ స్థానం కోసం టీడీపీ, జనసేన పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.