నేడు పరిషత్ పోరు
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:24 PM
జిల్లాలో పరిషత్ పోరుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 27 జడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.
- జిల్లాలో 27 జడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- పటిష్ఠ పోలీసు బందోబస్తు సిద్ధం
- ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ
విజయనగరం/రాజాం రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్ పోరుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 27 జడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందో బస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దిగువస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం 895 లొకేషన్లలో 1586 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న ఎన్నికల కోసం ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలతో సహా 2వేల మంది సిబ్బందిని నియమించారు. 56స్ట్రైకింగ్ ఫోర్స్‌ను, 27 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా మంచి ప్రవర్తన కోసం రౌడీషీటర్లతో పాటు 2వేల మందిని బైండోవర్ చేశారు. వారి నుంచి రూ.2 లక్షల వరకూ నగదు సెక్యూరిటీ బాండ్లు తీసుకున్నారు. మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.
11 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం..
జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలతో పాటు 449 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జడ్పీటీసీకి సంబంధించి 103 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 449 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 ఏకగ్రీవమయ్యాయి. రాజాం మండలంలో ఇద్దరు, రేగిడి నలుగురు, సంతకవిటి ఒకరు, తెర్లాంలో ఇద్దరు, వంగర ఒకరు, ఎల్.కోటలో ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 438 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
నిరంతరం పర్యవేక్షించాలి::కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వెబ్ కాస్టింగ్ తదితర మార్గాల ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. జేసీ సేథుమాధవన్‌తో కలిసి బుధవారం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి, పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన ఏర్పాట్లు, పోలింగ్ బృందాలు, డిస్ట్రిబూషన్ కేంద్రాలకు చేరుకున్న తీరు, సిబ్బంది, సామగ్రి పంపిణీపై అంశాలపై ఆరా తీశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల సీలింగ్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠా బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్‌చ వ్యయ పరిశీలకులు వెంకటేష్, డీఆర్‌వో సత్తిబాబు పాల్గొన్నారు.